ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ సేవలు

Banking Services In RBKs - Sakshi

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన

వ్యవసాయ శాఖ ప్రతిపాదనకు ఎస్‌ఎల్‌బీసీ ఆమోదం 

కేంద్రానికి నివేదిక..

అనుమతిస్తే వెంటనే సేవలు 

వీఏఏ, వీహెచ్‌ఏ,వీఎస్‌ఏలది కీలకపాత్ర 

రైతులు, బ్యాంకులకు సహాయకారులుగా పనులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి మరో వినూత్న సేవను అందించేందుకు వ్యవసాయ శాఖ సంకల్పించింది. రైతులకు బ్యాంకింగ్‌ సేవలను సైతం ఆర్బీకేల నుంచి అందించడానికి కృషి చేస్తోంది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ముసాయిదాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రాథమిక అవగాహన కూడా కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే ఆర్బీకేల నుంచి సేవలు ప్రారంభించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ కొత్త ఆలోచన మరో తార్కాణం అని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. పరపతి (క్రెడిట్‌) సౌకర్యం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ పలు కమిటీలు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది.  

కేంద్రానికి నివేదించిన అంశాలు
► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే క్రమంలో భాగంగా రాష్ట్రంలో గత నెల 30న సీఎం వైఎస్‌ జగన్‌ 10,641 ఆర్బీకేలను ప్రారంభించారు.
► ఆర్బీకేలలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు (వీహెచ్‌ఏ), విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ (వీఎస్‌ఏ) కీలకపాత్ర పోషిస్తారు.  
► వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతు ఇంటి ముంగిటే అందించడం ఆర్బీకేల ఉద్దేశం. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ సేవల్ని సైతం రైతుకు తన సొంత గ్రామంలోనే అందించాలని ప్రతిపాదిస్తున్నాం.  
► బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అందించే సేవలు.. ఆర్బీకేల్లో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు అందించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. రైతులు, బ్యాంక్‌ బ్రాంచ్‌ల మధ్య వారు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.  
► క్రెడిట్‌ కోసం బ్యాంక్‌కు సమర్పించడానికి వీలుగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో దరఖాస్తు ఫారాలను నింపడానికి సహకరిస్తారు. పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా బ్యాంకింగ్‌ సేవలను అందిస్తారు.  
► రూపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు జారీకి అవసరమైన ఆధార్‌ కార్డుల అనుసంధానానికి, కొత్త కార్డుల జారీకి, కేసీసీ పునరుద్ధరణకు దరఖాస్తు ఫారాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచవచ్చు.  
► పీఎంజేడీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై పథకాలలో నమోదుకు అర్హులైన రైతుల నుంచి సమ్మతి పత్రాలను సేకరించడానికి అనుమతించవచ్చు. అర్హత ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూరేలా చూడవచ్చు. 
► అర్హులైన వారికి రైతు భరోసా డబ్బు జమ కాకపోతే.. ఆ రైతుల తరఫున బ్యాంకులకు కావాల్సిన పత్రాలను సమర్పించవచ్చు.  
► రుణాల రికవరీలో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు బ్యాంకులకు సహాయం చేస్తారు. 
► తనిఖీ కోసం బ్యాంకర్లు తమ రుణగ్రహీతల జాబితాలను వారికి అందజేయవచ్చు. 
► అన్ని రకాల వ్యవసాయ రుణాలను సమీక్షించేందుకు (క్వాంటిటేటివ్‌) బ్యాంకులు తమకు బకాయి ఉన్న వారి వివరాలను వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలతో పంచుకోవచ్చు. 
► ఆర్బీకే సిబ్బందికి బ్యాంకులు ఓ సమయాన్ని కేటాయిస్తే ఇతర ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పని పూర్తికి వీలు కల్పించవచ్చు. 
► బ్యాంక్‌ మిత్రలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు తమ సేవలను ఆర్బీకేల నుంచి సాగించవచ్చు. వారే అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి సందేహాలు తీర్చవచ్చు. అవసరమైన సేవల్ని అందించవచ్చు.  
► నిర్దేశిత సమయంలో బ్యాంక్‌ అధికారులు ఆర్బీకేకు వెళితే ఆ గ్రామ రైతులతో భేటీ అయి బ్యాంకింగ్‌ సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించవచ్చు. పరపతి లక్ష్యాలను చేరుకునేందుకు వేదికలుగా ఆర్బీకేలను ఉపయోగించుకోవచ్చు.  
► ఇలా చేయడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ రైతులకు తప్పుతుంది. రుణాల జాప్యాన్ని నివారించవచ్చు. అర్హులైన వారందరికీ రుణాలు ఇచ్చి పంటల సాగుకు తోడ్పడవచ్చు. రైతులకు సేవలందించే క్రమంలో బ్యాంకర్లు ఆర్బీకే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.   

రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించేందుకే.. 
రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్లో భాగంగా వారి ఇంటి ముంగిటే బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్న ప్రతిపాదన వచ్చింది. రైతుల్లో చాలా మందికి బ్యాంకింగ్, ఆర్థిక  వ్యవహారాలపై అవగాహన ఉండదు. ఆ అంశాలపై అవగాహన కల్పించి త్వరితగతిన సేవలు అందిస్తే రైతులు తమ ఊరికి దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకునే అవసరం ఉండదు. దరఖాస్తు ఫారాలను నింపడానికి ఇతరుల సహకారం తీసుకునే పని ఉండదు. ఆధార్‌ అనుసంధానం కాలేదన్న సాకుతో రుణాలో, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయమో సకాలంలో అందలేదన్న ఫిర్యాదులు లేకుండా చేయొచ్చు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించే కృషిలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది.   
– కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top