‘అరకు ఉత్సవ్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

Araku Utsav 2020 to Start on Feb 29 - Sakshi

గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా రెండు రోజుల పాటు కార్యక్రమాలు

సాక్షి, విశాఖపట్నం: గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో బుధవారం ‘అరకు ఉత్సవ్‌–2020’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఉత్సవాలకు నోడల్‌ అధికారిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ వ్యవహరిస్తారన్నారు.  ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఈ ఉత్సవాల్లో ఎగ్జిబిషన్‌ స్టాల్స్, ఫుడ్‌ స్టాల్స్, డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన స్టాల్స్‌ 10 వంతున ఉంటాయన్నారు. అడ్వంచర్‌కు సంబంధించి పారామోటరింగ్‌ డే ట్రిప్, ఏటీవీ బైక్‌ రైడ్, రాప్లింగ్, జిప్‌ సైక్లింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్‌ తదితర క్రీడలు ఉంటాయన్నారు.  ఏపీ ఐటీడీఏ బృందాలచే ట్రైబల్‌ ఫోక్‌ డాన్స్‌లు, క్లాసికల్‌ డ్యాన్స్‌లు, మ్యూజికల్‌ డ్యాన్స్‌ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాటితో పాటు గ్రామీణ క్రీడలైన కోకో, కబడ్డీ, విలువిద్య, వాలీబాల్, రంగోలి పోటీలు ఉంటాయని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి, మెమొంటోలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జేసీ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు.  (చదవండి: చైనా నుంచి క్షేమంగా ఇంటికి..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top