రుణమాఫీలో ఏపీ రోల్‌మోడల్‌ | AP roll model in loan waiver says minister somireddy chandramohan reddy | Sakshi
Sakshi News home page

రుణమాఫీలో ఏపీ రోల్‌మోడల్‌

Nov 8 2017 10:57 AM | Updated on Nov 8 2017 10:57 AM

AP roll model in loan waiver says minister somireddy chandramohan reddy - Sakshi

ఒంగోలు టూటౌన్‌: రైతు రుణమాఫీలో రాష్ట్రం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల వారు మన రాష్ట్రం వచ్చి రుణమాఫీ అమలుపై అధ్యయనం చేయనున్నారని తెలిపారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోళు నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణ ఉపశమన పరిష్కార వేదికలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అందిస్తామని, ఇందులో రాజీపడేది లేదని పేర్కొన్నారు.

ప్రకాశంలో పరిష్కార వేదిక...
గన్నవరం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయగా, 9 లక్షల ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిలో 5.85 లక్షల ఫిర్యాదులను పరిష్కరించి రూ.545 కోట్లను సంబంధిత రైతుల ఖాతాలకు జమచేసినట్లు తెలిపారు. మూడో పర్యాయం ప్రకాశం జిల్లాలో పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ రూ.22 వేల కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రూ.33 వేల కోట్లు రుణమాఫీ ప్రకటించారని, మన రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రూ.5 కోట్ల జనాభాకు రూ.25,600 కోట్లు రుణమాఫీ చేశారని చెప్పారు. మూడో విడతలో రూ.3,600 కోట్లను రుణమాఫీ కింద రైతులకు జమ చేశామన్నారు. 

12 రోజుల పాటు కాల్‌ సెంటర్‌...
ఒక్క ప్రకాశం జిల్లాలోనే రూ.1,957 కోట్లను రైతు రుణమాఫీ కింద 10 శాతం వడ్డీతో కలిపి జమచేసినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో మూడు రోజుల పరిష్కార వేదిక పూర్తయ్యాక మరో 12 రోజుల పాటు వ్యవసాయశాఖ కార్యాలయంలో 08592–280046 నంబర్‌తో ఒక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప, అనంతపురం జిల్లాల్లోని గండికోట, చిత్రావతి, పైడిపల్లి రిజర్వాయర్లకు నీరందించడం ఒక చరిత్ర అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు 20 టీఎంసీలు, గుంటూరు జిల్లాకు 40 టీఎంసీల నీరు త్వరలో అందిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతులకు పరిష్కార వేదిక ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. వెలిగొండకు రెండోవైపు తవ్వకం పనులు చేపటినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న స్టాల్స్‌.. 
పాత జిల్లా పరిషత్‌ సమావేశపు మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణ ఉపశమన పరిష్కార వేదిక సందర్భంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.  మంత్రులు, జిల్లా అధికారులు కూడా వీటిని తిలకించారు. వీటితో పాటు వ్యవసాయశాఖ యాంత్రీకరణ పథకం కింద 18 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రుల వెంట ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,  వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, జిల్లా సంయుక్త కలెక్టర్‌ డి.మార్కండేయులు, వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, ఉద్యానవన శాఖాధికారులు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

రబీకి జిల్లాకు 20 టీఎంసీల నీరు
మార్టూరు: నాగార్జున సాగర్‌ కుడి కాలువకు సంబంధించి ప్రకాశం జిల్లాకు రబీ సీజన్‌లో 20 టీఎంసీల నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మార్టూరు మండలం ద్రోణాదులలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం రూ.43 వేల కోట్లు ఖర్చు చేసిందని, 20 లక్షల ఎకరాలను డ్రిప్‌ ఇరిగేషన్‌ కిందకు తీసుకురాగలిగామని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేశామన్నారు. రాబోయే కాలంలో 28 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 15, 16, 17 తేదీల్లో విశాఖ పట్టణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ హాజరుకానుందన్నారు. డ్రోన్‌ల ద్వారా భూముల స్థితిగతులను తెలుసుకునే ఆధునిక పరిజ్ఞానాన్ని మనకు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా రైతులకు మంజూరైన ట్రాక్టర్లు, పంట మార్పిడి యంత్రాలు తైవాన్‌ స్ప్రేయర్లను  ఆయన అందజేశారు. అనంతరం గ్రామంలోని సహకార సంఘ కార్యాలయ ఆవరణలో రైతుల కోసం జిల్లాలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఫార్మర్స్‌ వన్‌ స్టాప్‌ షాపు (సాప్‌)ను ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement