
అక్కడ చౌక మద్యం తెస్తే ఆంధ్రాలోనూ..
రాష్ట్రంలో మద్యం విక్రయాల విషయంలో తమిళనాడుతోపాటు తెలంగాణనూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం..
జూన్ 2న నిర్ణయిస్తామన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం విక్రయాల విషయంలో తమిళనాడుతోపాటు తెలంగాణనూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం చౌక మద్యాన్ని మార్కెట్‌లోకి తేవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చౌక మద్యం మార్కెట్‌లో తెస్తే తాను సైతం అదే బాటలో సాగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి అమల్లోకి తేవాల్సిన నూతన మద్యం విధానంపై ఈ నెల 22న సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో 55 నిమిషాలపాటు చర్చసాగింది.
ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం పదివేల జనాభాకు ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఫలితంగా తెలంగాణలో ప్రస్తుతమున్న 2,216 మద్యం దుకాణాలు 3,500కు పెరుగుతాయన్నారు. అంతేగాక చౌకధరకే(రూ.30 నుంచి రూ.40కు) మద్యాన్ని అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని, తెలంగాణ కనుక చౌక మద్యం తెస్తే సరిహద్దు ఆంధ్రాకు చెందిన ఆరు జిల్లాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి ఆంధ్రా సర్కారూ తెలంగాణ బాటలో నడవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో మద్యం విధానంపై వచ్చేనెల 2న నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.