వలలో వరాల మూట

AP Govt Allocates !00 Crore Rupees For Developing Nizampatnam Harbour - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో/నిజాంపట్నం: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ బడ్జెట్‌లో మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్‌లో అధిక శాతం కేటాయింపులు చేశారు. దీని ద్వారా జిల్లాలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూరనుంది.  సీఎం నిర్ణయంతో జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

జిల్లాలో 161 మత్స్యకార సొసైటీలు, 25,280 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట సమయంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇంతకు మునుపు కేవలం లక్ష రూపాయలు పరిహారం మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.10 లక్షలు పెంచారు. నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె మండలాల్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేలు నుంచి 10 వేలకు పెంచారు. దీని ద్వారా జిల్లాలో 7968 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు.

ఏడాదికి రూ.15 కోట్ల డీజిల్‌ రాయితీ 
జిల్లాలో మత్స్యకారులకు సంబంధించి పెద్ద బోట్లు 218 ఉన్నాయి. వీటికి నెలకు 3 వేల లీటర్ల డీజల్‌ను సబ్సిడీపై ఇస్తారు. 1874 చిన్న బోట్లకు నెలకు 300 లీటర్ల డీజల్‌ను సబ్సిడీపైన ఇవ్వనున్నారు. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 పైసల నుంచి రూ.12.06 పైసలకు పెంచింది. గతంలో కేవలం పెద్ద బోట్లకు మాత్రమే సబ్సిడీపై డీజిల్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం చిన్న బోట్లకూ సబ్సిడీపై డీజిల్‌ అందించనున్నారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.15 కోట్ల డీజిల్‌ సబ్సిడీని మత్స్యకారులు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రొయ్యల చెరువులు 8123 హెక్టార్లు, చేపల చెరువులు 500 హెక్టార్ల విస్తీర్ణంలో 5500 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ యూనిట్‌ రూ.6 చార్జీ ఉండేది. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీని యూనిట్‌కు రూ.2.70 పైసలకు తగ్గించారు. ప్రస్తుతం సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ చార్జీని యూనిట్‌కు రూ.1.50లకు తగ్గించారు.

నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధి కోసం.. 
నిజాపట్నం హార్బర్‌ అభివృద్ధికి మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా కృషి చేశారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న నిజాంపట్నం హార్బర్‌కు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. హార్బర్‌లో జెట్టీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం బోట్లు నిలుపుకొనేందుకు స్థలం సరిపోవడం లేదు. హార్బర్‌ రేవు సముద్రంలో కలిసే చోట ఇసుక మేట వేయడంతో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం సముద్రపు పోటు సమయంలో మాత్రమే బోట్లు హార్బర్‌కు వస్తున్నాయి. హార్బర్‌ పక్కనే ఉన్న రేవులో డ్రెడ్జింగ్‌ చేసిన ఇసుక దిబ్బలు తొలగించాలి. హార్బర్‌ చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మించాలి. ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదు. మంచినీటి సదుపాయం లేదు. ప్రస్తుతం బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో ఈ సమస్య తీరనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top