ఏపీ: హైరిస్క్‌ ప్రాంతాలుగా తెలంగాణ, కర్ణాటక.. | AP Government Has Made Changes To The Quarantine System | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు

Jul 13 2020 7:40 PM | Updated on Jul 13 2020 8:15 PM

AP Government Has Made Changes To The Quarantine System - Sakshi

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.(అనుమానితుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు..)

గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5వ రోజు, 7 రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని, 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. (ఏపీలో అన్ని ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు వాయిదా) 

రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఈ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచనలు జారీ చేసింది. హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికల పై గట్టి నిఘా గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement