అంకెల గారడీ

Ap budget only numbers no clarification - Sakshi

రెవెన్యూ మిగులు రూ.2,099.46 కోట్లు.. ద్రవ్యలోటు రూ.32,390.67 కోట్లు

రైతుల రుణమాఫీకి నిధులు కేటాయింపు శూన్యం.. ఆరోగ్యశ్రీకి అరకొరే..

నిరుద్యోగ భృతికి రూ.40,800 కోట్లు అవసరం కాగా కేటాయించింది రూ.1,200 కోట్లే

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ బకాయిలు రూ.2,400 కోట్లు.. కేటాయించింది రూ.1,100 కోట్లే

బీసీలకు వెన్నుపోటు.. ఎస్సీ, ఎస్టీలకు వంచన.. సబ్‌ప్లాన్‌ నిధులు పసుపు–కుంకుమకు

ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అంకెల గారడీ చేశారంటున్న ఆర్థిక నిపుణులు

నాలుగు నెలలకు రూ.76,816.85 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ పద్దులో ప్రతిపాదన

రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సంక్షిప్తంగా.. (అంకెలు రూ. కోట్లలో)
మొత్తం బడ్జెట్‌ 2,26,177.53
రెవెన్యూ వ్యయం 1,80,369.32
కేపిటల్‌ వ్యయం 29,596.53
రెవెన్యూ ఆదాయం 1,78,269.85
కేంద్ర పన్నుల్లో వాటా 36,360.26
కేంద్ర గ్రాంట్లు 60,721.51
రెవెన్యూ మిగులు 2,099.46
ద్రవ్యలోటు 32,390.67
ఏప్రిల్‌ నుంచి  జూలై వరకూ వ్యయం 76,816.85  

సాక్షి, అమరావతి :చివరి బడ్జెట్‌లో టీడీపీ సర్కారు చిత్ర విచిత్రాలు..! రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు మంగళవారం సమర్పించిన 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014–15 నుంచి 2018–19 వరకు  ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్‌లోనూ రంగాలవారీగా భారీగా కేటాయింపులు చేయడం,  ఆ తర్వాత నిధులను సమకూర్చలేక చేతులెత్తేయడం రివాజుగా మారింది. ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ తమ ధోరణిని చంద్రబాబు–యనమల జోడి మార్చుకోలేదు. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడవచ్చని భావిస్తున్న తరుణంలో బడ్జెట్‌లో అంకెల ఆర్భాటంతో కనికట్టు చేసేందుకు ప్రయత్నించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మాత్రమే వర్తిస్తుంది. 2019–20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొలువు తీరే సర్కారే ప్రవేశపెడుతుందన్నది తెలిసిందే. ఈ నాలుగు నెలకు రూ.76,816.85 కోట్ల వ్యయం అవుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లెక్క కట్టారు. 

రైతులు, డ్వాక్రా మహిళలకు మళ్లీ దగా..
గత ఎన్నికలకు ముందు లెక్కకు మించి చేసిన వాగ్దానాలకు గత ఐదు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించకుండా సీఎం చంద్రబాబు హామీలను తుంగలో తొక్కారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీని కమిటీలు, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ తదితర వడపోతల పేరుతో రూ.24 వేల కోట్లకు కుదించారు.  అందులోనూ ఇంకా రూ. 8,200 కోట్లు బకాయి ఉంది. దీనికి ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల నిధులేమీ కేటాయించలేదు. రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు రైతులను నిలువునా మోసగించడంతో వ్యవసాయ రుణాలు గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.1.37 లక్షల కోట్లకు చేరాయి. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిసి తన వంచనను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎన్నికలకు ముందు ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ‘యూ’ టర్న్‌ తీసుకున్నారు. పెట్టుబడి నిధి కింద ఒక్కో మహిళకు రూ,.పది వేలు ఇస్తామంటూ నాలుగున్నరేళ్ల పాటు సాగదీశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి నెల ముందు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీ చెల్లింపులకు నిధులివ్వడం లేదు. దీంతో డ్వాక్రా  సంఘాల నుంచి బ్యాంకులు ఇప్పటివరకు వడ్డీ కింద రూ.2,400 కోట్లను వసూలు చేశాయి. తాజా బడ్జెట్‌లో వడ్డీలేని రుణాలకు రూ.1,100 కోట్లనే కేటాయించారు. అంటే ఈ కేటాయింపులు బకాయిలు చెల్లించడానికి కూడా చాలవన్నది స్పష్టమవుతోంది.

నిరుద్యోగులను నిలువునా ముంచేశారు..
‘జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. లేదంటే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.రెండు వేల చొప్పున ఇస్తాం’ అని గత ఎన్నికల్లో టీడీపీ ఇంటింటికీ ప్రచారం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. కానీ  అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న సిబ్బందినే తొలగిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. భృతి కింద రూ.రెండు వేలు ఇవ్వకుండా దారుణంగా మోసగించింది. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీయడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు భృతి పేరుతో బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు. కానీ ఆ ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2018–19లో నిరుద్యోగ భృతికి రూ.1,000 కోట్లను కేటాయించినా నవంబర్‌ వరకూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఆ తర్వాత నెలకు రూ.వెయ్యి చొప్పున భృతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలకుగానూ టీడీపీ ఎన్నికల హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 3.58 లక్షల మందికి నెలకు రూ.1,000 చొప్పున రూ.116.88 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు ఎన్నికలకు నెల ముందు నిరుద్యోగ భృతిని రూ.రెండు వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. 1.70 కోట్ల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏడాదికి రూ.40,800 కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. 

బీసీలకు వెన్నుపోటు..
వెనుకబడిన తరగతులకు చెందిన అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటును అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని ఎన్నికలకు ముందు కాపీ కొట్టిన సీఎం చంద్రబాబు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గత బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు రూ.1,337.81 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. బీసీల్లో కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తే ఒక్కో కార్పొరేషన్‌కు రూ.80 నుంచి రూ.90 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. 

వైద్యం నిర్వీర్యం..
ఆరోగ్యశ్రీ పథకానికి సర్కారు గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను కేటాయిస్తే ఆ నిధులు ఏ మూలకూ సరిపోలేదు. ప్రస్తుతం ఆసుపత్రులకు రూ.650 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పడింది. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బకాయిలు పోనూ కేవలం రూ.550 కోట్లే మిగులుతాయి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు చెల్లించే రుసుము పెంచిన నేపథ్యంలో ఈ నిధులు తొలి త్రైమాసికానికి కూడా సరిపోవన్నది తేటతెల్లమవుతోంది. ఇక సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపుల్లోనూ సర్కారుకు చిత్తశుద్ధి లేదని స్పష్టమైంది.

సబ్‌ప్లాన్‌ నిధులను సర్దేశారు...
బడుగు, బలహీన వర్గాలకు ఉప ప్రణాళిక కింద 2018–19లో రూ.11,229.10 కోట్లను కేటాయిస్తే.. 2019–20లో రూ.14,367.34 కోట్లు కేటాయించారు. గిరిజనులకు ఉప ప్రణాళిక కింద 2018–19లో రూ.4,176.61 కోట్లు కేటాయిస్తే 2019–20లో రూ.5,385.31 కోట్లు కేటాయించారు. కానీ 2018–19లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కేటాయించిన నిధుల్లో రూ.2,137 కోట్లను పసుపు–కుంకుమ పథకానికి మళ్లించేయడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల జీవనోపాధుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన ఈ నిధులను దారి మళ్లించి ఆ వర్గాల ప్రజలకు చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాదీ కూడా నిధులను అదే రీతిలో దారి మళ్లించరనే గ్యారంటీ ఏమీ లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top