ఏపీలో 15 నుంచి పప్పుధాన్యాల సేకరణ

Andhra Pradesh Government to Buy Pulses From Oct 15 - Sakshi

అపరాలు, పెసలు, కందులు 60 వేల టన్నుల కొనుగోలుకు నిర్ణయం

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు

సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ చర్యలు తీసుకుంది. వైఎస్‌ జగన్‌ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు. రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–క్రాపింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.  

వ్యాపారుల పట్ల రైతు సంఘాల ఆందోళన
శనగల కొనుగోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది. గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు. వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.7,050, మినుములకు రూ.5,700లను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)గా ప్రకటించింది. అయితే.. మార్కెట్‌లో పెసలకు రూ.5,500, మినుములకు రూ.4,700లకు మించి ధర లభించడం లేదు. దీంతో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలి, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, జెడ్‌ రంగంపేట, కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్, మైలవరం, పరిటాల, కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

పెసల కొనుగోలు కేంద్రాలను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, జెడ్‌ రంగంపేట, కృష్ణా జిల్లా నందిగామ, పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం, కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో ఏర్పాటు చేస్తారు. పెసలు, మినుములు 20 వేల టన్నులు, కందులు 40 వేల టన్నులు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top