భూములిచ్చి రోడ్డునపడ్డాం..

Amaravati Farmers Couple Sharing Their Problems - Sakshi

ఆఖరకు పింఛనుకూ నోచుకోలేక పోయాం

కౌలు కూడా ఇవ్వమంటున్నారు

సచివాలయంలో ఉద్యోగాలిచ్చి తొలగించారు!

బతుకు దుర్భరమైందని రాజధాని రైతు కుటుంబం  ఆవేదన

‘అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్,  వడిగల యెద్దుల గట్టుక మడిదున్నక బతుకవచ్చు     మహిలో సుమతి’ అని శతకారుడు చెప్తాడు. అంటే జీతం ఇయ్యని దొర దగ్గర పనిచేసే కంటే రెండు చురుకైన ఎద్దులను నమ్ముకుని పొలాన్ని దున్నుకుంటే లాభముంటుందని అర్ధం. అదే ఎద్దులను, కాడిని కూడా లాగేసుకునేవాడు పరిపాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ దంపతులే ఉదాహరణ. అదిగో అమరావతి.. ఇదిగో ఉజ్వల భవిష్యత్‌’ అన్న పాలకుల బురిడీ మాటలు నమ్మి ఆర్థికంగా ఆదుకుంటున్న పొలాన్ని అప్పనంగా అప్పచెప్పిన నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఆ దంపతులు. ఉద్యోగాలిచ్చామని చెప్పి.. రెండేళ్లు పని చేయించుకుని తీరా ఇప్పుడు మెడపట్టుకుని బయటకు గెంటేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్న బాధితుల మాటల్లో నిజం లేకపోలేదు. ఇది అమరావతి కథ. అందులోని ఓ రైతు వ్యథ.

కృష్ణాజిల్లా, మంగళగిరి: రాజధాని భూసమీకరణ గ్రామాల్లో ఒకటి  కృష్ణాయపాలెం. గ్రామానికి చెందిన రైతు వేమూరి సోమయ్య, వేమూరి మరియమ్మలకు సర్వే నెంబర్‌ 121,122లలో 23 సెంట్లు భూమి ఉంది. రాజధాని రాకముందు ఆ కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు సాగు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగించే వారు. మూడు రకాల ఆకుకూరలు సాగు చేసుకుంటే వారానికి రూ.3 వేల నుంచి 4 వేల ఆదాయం వచ్చేది.  ఖాళీ సమయంలో వేరే రైతుల పొలాల్లో కూలీకి వెళ్లి వచ్చినదాంతో జీవనం సాగించే వారు.

అయితే రాజధాని రావడంతో ఉన్న 23 సెంట్ల భూమి రాజధాని భూ సమీకరణలో ఇచ్చారు. దీంతో కూరలు సాగు చేసేది లేకపోవడంతో గ్రామంలోని భూములు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తీసుకోవడంతో కూలి పని లేకుండా పోయింది. దీంతో కొద్దికాలం వేరే గ్రామాల్లో  పనులు చేసుకుని జీవనం గడిపారు. ఇంతలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో అక్కడ క్లీనింగ్‌ విభాగంలో ఇద్దరూ పనికి చేరారు. తాము భూ సమీకరణకు ఇచ్చిన భూమి వివాదంలో ఉందనే కారణంతో కౌలు నిలిపివేసిన అధికా రులు, రాజధాని గ్రామాలలో రైతు కూలీలకు ఇచ్చే రూ.2500 పింఛన్లు సోమయ్య పేరు మీద భూమి మీద ఉందనే సాకుతో నిలిపివేశారు. భూమి సోమయ్య పేరున ఉంటే కౌలు చెల్లించకుండా ఆపి, భూమి ఉందనే ఫించను ఇవ్వకుండా అధికారులు ద్వంద్వవైఖరి అవలంభించడం గమనార్హం. సదరు భూమిలో తనకు వాటా ఉం దంటూ తన సోదరి తనయుడు సీఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒరిజినల్‌ పట్టా ఆధారంగా గ్రామంలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఆ పని చేయకుండా పక్కన పడేశారు.

తాత్కాలిక సచివాలయంలో క్లీనింగ్‌ విభాగంలో రెండు సంవత్సరాలు నుంచి పని చేస్తుండగా కొద్ది కాలం క్రితం మరియమ్మ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తమై దంపతులు ఇరువురు పనికి హాజరు కాలేకపోగా సమస్యను సం బంధిత విభాగంలోని వారికి తెలియజేశారు. వారం రోజుల అనంతరం విధులకు హాజరయ్యేం దుకు వచ్చిన సోమయ్య, మరియమ్మలను ‘మిమ్మల్ని పనిలోంచి తీసివేశామని’ సదరు కాంట్రాక్టరు చెప్పడంతో అవాక్కయిన వారు మూడు నెలలుగా తాత్కాలిక సచివాలయం చుట్టూ తిరుగుతూ కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. అయినా ఒక్కరూ కనికరించకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నారు. రాజధాని భూసమీకరణ సమయంలో భూములిచ్చిన రైతులతో ఆయా గ్రామాల్లోని రైతు కూలీలకు, చేతివృత్తిదారులకు పింఛన్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచితంగా ఇళ్ల నిర్మాణం అంటూ ఎన్నో హామీలను ఇచ్చి భూములు లాక్కుని ఒక్క హామీని నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమతో ఎంతో మంది రైతులు, రైతుకూలీలు ఉద్యోగాలలో చేరారని, వారిని ఎలాంటి కారణం లేకుండా ఇంటికి పంపుతూ మళ్లీ వారి స్థానంలో అధికార పార్టీ నేతలు చెప్పిన వారిని నియమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నదంతా అప్పచెప్పాం...
గ్రామంలో ఉన్న 23 సెంట్లు రాజధానికి ఇచ్చాం. రాజధాని రాకముందు ఉన్న కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు పండించుకుని జీవించే వాళ్లం. భూసమీకరణలో భూమి తీసుకున్న అధికారులు పొలం వివాదంలో ఉందనే నెపంతో కౌలు ఇవ్వడం లేదు. భూమి ఉందనే పేరుతో పింఛను ఇవ్వడం లేదు. ఆడపిల్ల పెళళ్లి చేసి అప్పులు పాలయ్యాం. ఇంటికో ఉద్యోగమని చెప్పారు. డిప్లమా చదివిన అబ్బాయి నిరుద్యోగిగా ఉన్నాడు. ఉన్న ఉద్యోగాలు తీసేయడంతో మా బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయి. సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె కట్టే పరిస్థితి లేదు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు బ్రతుకుతెరువు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top