
రాజధాని రోడ్ల అంచనాల్లో రికార్డు బద్దలు
సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డు మూడో దశ విస్తరణ పనులకు ఏడీసీఎల్ టెండరు
755 మీటర్ల పొడవున ఆరు వరుసలతో నిర్మాణం
కాంట్రాక్టు విలువ రూ.74.82 కోట్లు
మీటరు రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు
అంచనాలు చూసి నిర్ఘాంతపోతున్న ఇంజినీరింగ్ నిపుణులు
రాజధాని రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో కాకుండా బంగారంతో వేస్తున్నారా అంటూ విస్మయం
జాతీయ రహదారులను మీటరుకు రూ.2 లక్షలే వెచ్చిస్తున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)
సాక్షి, అమరావతి: రాజధానిలో రోడ్ల నిర్మాణ పనుల అంచనాల్లో ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) తన రికార్డులను తానే బద్ధలుకొడుతోంది. ఈ–13 రహదారిని 6 వరుస (లేన్)లతో ఎన్‌హెచ్–16 వరకూ పొడిగించే పనులను కి.మీకు రూ.66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టరుకు అప్పగించిన ఏడీసీఎల్, తాజాగా.. సీడ్ యాక్స్‌స్ రోడ్డును మూడో దశలో 6 వరుసలతో 755 మీటర్ల పొడవు (ఇందులో కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువపై 130 మీటర్ల పొడవుతో నిర్మించే స్టీలు బ్రిడ్జితో కలిపి)తో నిర్మించి, పాత మంగళగిరి హైవేతో కలిపే పనులకు రూ.61.67 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది.
జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.13.15 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. 755 మీటర్ల రోడ్డు కాంట్రాక్టు విలువ రూ.74.82 కోట్లన్న మాట. అంటే.. మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆ రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో నిరి్మస్తున్నారా లేక బంగారం పూతతో వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారులను మీటరు రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షలతోనే ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముడుపుల కోసమే రోడ్డు పనుల అంచనాలను పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పనుల పూర్తికి 4 నెలలు గడువు..
రాజధానిలో ప్రధాన ప్రాంతానికి (సీడ్ కేపిటల్) కోల్‌కత–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానించేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ3)ను ఏడీసీఎల్ నిరి్మస్తోంది. అందులో భాగంగా ఈ రోడ్డును పాత మంగళగిరి హైవేతో అనుసంధానం చేసే పనులను మూడో దశలో టెండరు పిలిచింది. మూడో దశలో 755 మీటర్ల పొడవున 6 వరుసల (స్ట్రీట్‌లైట్లు, ఫుట్‌పాత్, యుటిలిటీ డక్ట్‌లు, వరద నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు)తో నిర్మించే పనులకు టెండర్లు పిలిచింది. ఇందులో..
కృష్ణా డెల్టా పశ్చిమ కాలువపై 130 మీటర్ల పొడవున స్టీలుబ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ పనుల పూర్తికి 4 నెలలు గడువుగా నిర్దేశించి ఈనెల 3న టెండరు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ టెండరులో బిడ్ దాఖలు గడువు గురువారం సా.5 గంటలతో ముగియనుంది. ఆర్థిక బిడ్ శుక్రవారం తెరిచి.. తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థను ఎల్–1గా తేల్చి.. ఆ సంస్థకే పనులు అప్పగించాలని సీఆర్‌డీఏకి ఏడీసీఎల్ సీఈ ప్రతిపాదన పంపనున్నారు.