
సాక్షి, అమరావతి: తమ భూములను ఎంజాయ్‌మెంట్ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైండ్ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం మూడో రోజుకి చేరకుంది. దీక్ష చేపట్టిన రైతుల షుగర్, బీపీ లెవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు చేపట్టిన దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు చేపట్టిన దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, వామపక్షాలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు.
రాజధాని ప్రకటన సమయంలో చేసిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో తమ భూములు నమోదు చేయకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు కక్ష పూరితంగా వ్యవహరించారని దీక్ష చేపట్టిన రైతులు మండిపడ్డారు. తమకు చెందిన 49 ఎకరాల చుట్టు పక్కల ఉన్న భూములన్నింటినీ సర్వేలో నమోదు చేసి తమ భూములను మాత్రం చేయకపోవడానికి ప్రధాన కారణం తమ భూములపై టీడీపీ నేతల కన్నుపడటమేనని రైతులు ఆరోపిస్తున్నారు.