దాదాపు 12 ఏళ్ల క్రితం మిడ్జిల్ మండలం రాచాలపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరుతో ఓ బెదిరింపు లేఖ వెలిసింది. ఈ విషయం తెలిసినా పోలీసులు అప్పట్లో పెద్దగా స్పందించలేదు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: దాదాపు 12 ఏళ్ల క్రితం మిడ్జిల్ మండలం రాచాలపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరుతో ఓ బెదిరింపు లేఖ వెలిసింది. ఈ విషయం తెలిసినా పోలీసులు అప్పట్లో పెద్దగా స్పందించలేదు. మావోయిస్టులు ఎక్కడున్నారబ్బా! అంటూ నిర్లక్ష్యం చే శారు. ఎవరూ ఊహించని విధంగా ఆ గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నేత వెంకటరెడ్డిని కాల్చి చంపారు.
తిరిగి మూడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రాచాలపల్లి సర్పంచ్‌గా విజయలక్ష్మి పోటీచేయడంతో ఆమె కుమారుడు శ్రీధర్‌రెడ్డిని బెదిరిస్తూ అప్పట్లో మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది. గతంలో వెంకటరెడ్డికి పట్టిన గతే పడుతుందని ఆ లేఖలో పేర్కొనడంతో ప్రాణభయంతో ఈ విషయాన్ని శ్రీధర్‌రెడ్డి మిడ్జిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటిరెండు రోజులు విచారించి ఆ బెదిరింపు లేఖ ఎవరో అగంతకులు రాసిందేనని చెప్పారే తప్ప ఎవరు రాశారనే విషయాన్ని తేల్చలేకపోయారు. మూడు నెలల తిరగకముందే గురువారం రాత్రి మరో బెదిరింపు లేఖ రాసి గోడకు అతికించడంతో గ్రామస్తులు భయాందోళనచెందుతున్నారు.
‘సర్పంచ్ పదవిలో ఉంటూ గ్రామాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారమనే అండతో తప్పులో తప్పు చేస్తున్నారు. మాకు ఓపిక, సహనం ఉన్నంతవరకే మీ ఆటలు సాగుతాయ్. మాకు తిక్కరేగిందంటే ఊళ్లో పడి మేము ఏం చేస్తామో మీకు తెలుసు. కయ్యానికి కాళ్లు దువ్వితే ఆనాడు వెంకటరెడ్డికి ఈనాడు ఎవరో నిర్ణయించుకోండి..’ అంటూ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని ఉద్దేశించి మావోయిస్టుల పేరుతో లేఖ కనిపించడంతో రాచాలపల్లిలో మళ్లీ కలకలం మొదలైంది. ఇదే తరహాలో మూడు నెలల క్రితం లేఖ రావడ ం తిరిగి ప్రస్తుతం మరోలేఖ రావడంతో సర్పంచ్ కుటుంబంలో ఆందోళన ఆరంభమైంది.
‘ప్రజల క్షేమమే మాక్షేమం.. ప్రజల ఆశయమే మా ఆశయం’ అనే నినాదాలతో పోస్టర్ వెలియడంతో పోలీసులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. జిల్లాలో మావోయిస్టుల ఉనికే లేదని అందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా గ్రామ సర్పంచ్ కుటుంబం మాత్రం భయం నుంచి తేరుకోవడం లేదు. పోలీసులు వెంటనే విచారణ చేపట్టి ఆ లేఖ నిజంగా మావోయిస్టులు విడుదల చేసిందా? లేదా? గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపుల కోసం ఇలా చేశారా? తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.