సీఎం పర్యటనకు సర్వం సిద్ధం 

All Arrangements Ready To AP Cm Ys Jagan Perecherla Visit - Sakshi

హోం మంత్రి మేకతోటి సుచరిత

నేడు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్న సీఎం జగన్‌

 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం పేరేచర్ల పరిధిలోని డోకిపర్రు వద్ద నిర్వహించనున్న వన మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

సాక్షి, అమరావతి : పర్యావరణాన్ని రక్షించడంలో చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టినట్టు హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న సందర్భంగా మంత్రి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్, అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, అధికారులను సభావేదిక, హెలీప్యాడ్‌ ప్రాంతాల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ తరాల కోసం మొక్కలు పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సౌత్‌ డీఎస్పీ కమలాకర్, మేడికొండూరు సీఐ ఆనందరావు పాల్గొన్నారు. 

ఏర్పాట్లు పూర్తి..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో శనివారం ఉదయం 10.30 గంటలకు పర్యటిస్తున్నారు. మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డులో  జరిగే వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 4 వేల మొక్కలు నాటేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 68 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా,  ఇప్పటికే  38 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్‌  ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి అమీనాబాద్‌లో  ఏర్పాటు చేసిన  హెలీప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు,  అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్నినాని, జిల్లా మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు చేరుకొని 11.30 గంటల తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పార్లమెంటరీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త  చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు నగర అధ్యక్షుడు  పాదర్తి రమేష్‌గాంధీ పరిశీలించారు.


హెలీప్యాడ్‌ వద్ద తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top