నరకయాతన | Adoni People Demand For Dialysis Centre In Kurnool | Sakshi
Sakshi News home page

నరకయాతన

Jun 30 2018 12:31 PM | Updated on Jun 30 2018 12:31 PM

Adoni People Demand For Dialysis Centre In Kurnool - Sakshi

సిద్ధంగా ఉన్న మిషన్లు

ఆదోని టౌన్‌: డయాలసిస్‌ వ్యాధి గ్రస్తుల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారానికి రెండు, మూడు సార్లు కర్నూలుకు వెళ్లి వైద్యం చేయించుకొని వచ్చేందుకు వారు పడుతున్న అవస్థలు దేవుడికెరుక. ఒక పక్క మందులకు.. మరో పక్క రవాణా చార్జీలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదోని డివిజన్‌ కేంద్రమైన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు కల ఎన్నటికి తీరేనోనని రోగులు, వారి బంధువులు ఎదురు చూస్తున్నారు. 

డివిజన్‌ వ్యాప్తంగా 60 మంది డయాలసిస్‌ పేషెంట్లు
ఆదోని డివిజన్‌లో 60 మంది దాకా డయాలసిస్‌ రోగులు ఉన్నారు. అయినప్పటికీ సెంటర్‌ ఏర్పాటులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రాణాంతక జబ్బు వ్యాపించిన వ్యాధిగ్రస్తులు వేలకు వేలు  ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. 25 మందికి పైగా ఉంటే సెంటర్‌ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డయాలసిస్‌ పేషెంట్లకు గతంలో మాదిరిగా ఆరోగ్య పథకం కింద వైద్యం అందించాలని, వ్యాధి సోకిన సమయంలో ఖరీదైన, అధిక మోతాదు కలిగిన ఇంజెక్షన్లు వేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు. 

రవాణా చార్జీలు భారం
పూట గడవడమే కష్టంగా ఉంది. అమ్మ పింఛన్‌ సొమ్ముతో జీవనం సాగిస్తున్నాం. వారానికి రెండు మూడు సార్లు కర్నూలుకు వెళ్లి వైద్యం చేయించుకొని రావాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పైగా ఖర్చవుతోంది. రవాణా చార్జీలే భారంగా మారాయి. స్నేహితులు, తెలిసిన వారు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన జీవితం మరెవరికీ రాకూడదు.  – చంద్రమౌళీ, వ్యాధిగ్రస్తుడు  

ఉచిత బస్సు పాసులు ఇవ్వాలి
డయాలసిస్‌ వ్యాధి గ్రస్తులకు ఉచిత బస్సు పాసులు, మెడిసిన్‌ ఖర్చులు ఇవ్వాలి. 2కె ఇంజెక్షన్‌ బదులు 4కె ఇంజెక్షన్లు వేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాధి గ్రస్తులు కర్నూలు, ఆదోనికి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఆర్థిక భాకమవుతోంది. ఉచిత బస్సు పాసులు ఇస్తే కొంతైనా మేలు జరుగుతుంది.  – దిలీప్, స్థానికుడు  

వచ్చేనెల 15 లోగా సెంటర్‌ ఏర్పాటు
పనులు వేగంగానే జరుగుతున్నాయి. వచ్చేనెల 15 లోగా పూర్తవుతాయి. ఆ వెంటనే సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. పది మిషన్లు, పది మంచాలు, ఇద్దరు డాక్టర్లు, నలుగురు టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సుల నియామకం  కూడా జరిగింది.  – శివప్రసాద్‌రెడ్డి, యూనిట్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement