అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించొద్దు

Additional SP Focus on Other State Vehicles Kurnool - Sakshi

ఇతర రాష్ట్రాల వాహనాలపై దృష్టి పెట్టండి

అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి  

హాలహర్వి: గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించొద్దని.. వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. మంగళవారం హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును ఆమె పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు గ్రామాలు, రహదారుల వివరాలను పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల ఆఖరు వరకు  లాక్‌డౌన్‌ విధించిందన్నారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని, ఇతర రాష్ట్రాల వాహనాలు వస్తే వాటి వివరాలు నిశితంగా పరిశీలించాలని చెప్పారు. ముఖ్యంగా కర్ణాటక మధ్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎవరైనా కర్ణాటక మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయాలన్నారు.  అలాగే వేదావతి నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులు కూడా సరిహద్దు పల్లెలపై ప్రత్యేక  దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మెదేహాల్, చింతకుంట గ్రామాల్లో అడిషనల్‌ ఎస్పీ పర్యటించి ప్రజలతో మాట్లాడారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే 7993822444 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట ఆలూరు సీఐ భాస్కర్, హాలహర్వి ఎస్‌ఐ బాల నరసింహులు  ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top