అదనపు బాదుడు రూ. 4,691 కోట్లు | Additional bid of Rs. 4,691 crores on diesel, petrol | Sakshi
Sakshi News home page

డీజిల్, పెట్రోల్‌పై అదనపు బాదుడు రూ. 4,691 కోట్లు

Sep 23 2017 3:09 AM | Updated on Sep 23 2017 3:17 AM

Additional bid of Rs. 4,691 crores on diesel, petrol

సాక్షి, అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్నుల రూపంలో భారీగా వసూలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిబ్రవరి 05, 2015న రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై తొలిసారిగా అదనపు వ్యాట్‌ను ప్రవేశపెట్టింది. వీటిపై లీటరుకు రూ. 4 పన్ను విధించింది. అప్పటికే వ్యాట్‌ రూపంలో వసూలు చేస్తున్న పన్నులకు ఇది అదనం. కేవలం ఈ అదనపు వ్యాట్‌తో ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజల జేబు నుంచి అదనంగా రూ. 4,691 కోట్లు ప్రభుత్వం చాకచక్యంగా లాగేసింది. ఈ మొత్తం సాధారణంగా రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్, కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ సుంకాలకు పూర్తిగా అదనం.

తెలియకుండా జేబు ఖాళీ: ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న ప్రతీ లీటరు పెట్రోల్‌ ధరలో రూ. 20.95 నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్లిపోతుంది. కానీ ఫిబ్రవరి 2015కు ముందు ఇది రూ.13.99గా ఉండేది. అంటే ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పైన పన్ను రేట్లను తెలియకుండా 49.74 శాతం పెంచేసింది. ఇదే విధంగా డీజిల్‌పై లీటరు పన్ను రేటు రూ. 8.86 నుంచి రూ.14.87కు అంటే 67.83 శాతం పెరిగిపోయింది. గడిచిన రెండేళ్లలోనే పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 16,714 కోట్లు వచ్చాయి.

ముడిచమురు పేరుతో..
రాష్ట్ర ఖజానా రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిపోతుండటంతో వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుందంటూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యాట్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఇంధన రేట్లు గరిష్ట స్థాయికి చేరుకునిప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనికరం చూపించడంలేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు.

కేంద్రం తక్కువేమి కాదు...
కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్‌ సుంకాన్ని డీజిల్‌పై 380 శాతం, పెట్రోల్‌పై 120 శాతం పెంచింది. అంతర్జాతీయ మార్కోట్లో ధరలు తగ్గుతున్నా కూడా ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోయింది. దీంతో 2014లో లీటర్‌ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న ఎక్సైజ్‌ సుంకం రూ.17.33కు, పెట్రోల్‌పై రూ.9.48 నుంచి రూ.21.48 శాతానికి పెరిగిపోయింది. దీంతో 2013–14లో రూ.77,982 కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు 2016–17 నాటికి రూ. 2,42,691 కోట్లు దాటింది. అంటే మూడేళ్లలో అదనంగా రూ.1,64,709 కోట్లు బాదేశారన్నమాట.

42 శాతం రాష్ట్రానికి..
కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ సుంకంలో ఆయా రాష్ట్రాలకు 42 శాతం వెనక్కి వస్తాయి. అంటే ప్రతీ లీటర్‌ పెట్రోలు మీద కేంద్రం ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ. 21.48లో రూ. 9.02లు రాష్ట్ర ఖజానికి వస్తాయి. అదే విధంగా డీజిల్‌పై వసూలు చేస్తున్న రూ. 17.33లో రూ. 7.27 రాష్ట్రానికి వెనక్కి వచ్చేస్తాయి. ఈ విధంగా చూస్తే గడిచిన రెండున్నర ఏళ్లలో డీజిల్‌పై కేంద్రం నుంచి రూ. 6,127 కోట్లు, పెట్రోల్‌పై రూ. 2,976 కోట్లు రాష్ట్ర ఖజానాకి వచ్చాయి. ఈ విధంగా అధిక సుంకాలతో ఎడాపెడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను వాయించేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement