చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన సావిత్రమ్మను డబ్బు కోసం దారుణంగా హత్య చేశారని తెలిసింది.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన సావిత్రమ్మను డబ్బు కోసం దారుణంగా హత్య చేశారని తెలిసింది. ఆశా వర్కర్‌గా ఉంటూనే మరో సంస్థ ఏజెంటుగా కూడా ఆమె వ్యవహరించేది. సుజాత అనే మహిళ ద్వారా చాలా మందికి రుణాలు కూడా ఇచ్చినటున్ల సమాచారం.
సుజాత నుంచి ఫోన్ రాకతో...
అప్పు తీసుకున్న వాళ్లు డబ్బులు చెల్లిస్తారంటూ గత నెల 25న సుజాత నుంచి సావిత్రమ్మకు ఫోన్‌కాల్ రావడంతో ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. అలా వెళ్లిన ఆమె ఆ తరువాత కన్పించలేదు. కుటుంబ సభ్యులకు ఆందోళనకు గురయ్యారు.
రెండ్రోజులకే రైలు పట్టాలపై
విగతజీవిగా..
అదృశ్యమైన సావిత్రమ్మ రెండ్రోజుల తరువాత(గత నెల 27న) రైలు పట్టాలపై మృతదేహమై కన్పించింది. గొంతుకు లుంగీతో బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైనట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి రైలుపట్టాలపై పడేయడం సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపారు. సంఘటన వివరాలను రైల్వే పోలీసులు తమ శాఖ ఎస్పీకి అందించారు.
అదుపులో నిందితులు
సావిత్రమ్మ హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సావిత్రమ్మను డబ్బు కోసం గానీ, నిందితుల తరపున వివాహేతర సంబంధం వల్ల గానీ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేపే అవకాశం ఉంది.