అవినీతి భాస్కరుడు | ACB traps in excise department | Sakshi
Sakshi News home page

అవినీతి భాస్కరుడు

Feb 8 2014 2:37 AM | Updated on Aug 17 2018 2:53 PM

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) అల్లం విజయ్ భాస్కర్‌రెడ్డి చిక్కాడు.

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) అల్లం విజయ్ భాస్కర్‌రెడ్డి చిక్కాడు. శుక్రవారం ఈఎస్ తన చాంబర్‌లో మద్యం వ్యాపారి చింతల రవీందర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. రవీందర్‌రెడ్డికి ఆదిలాబాద్ పట్టణంలోని గజిట్ షాపు నంబర్ 1, జైనథ్‌లోని షాపు నంబర్ 2, భోరజ్ చెక్‌పోస్టు వద్ద షాపు నంబర్-8 మద్యం దుకాణాలు ఉన్నాయి.

ఈ మద్యం దుకాణాల నుంచి నెలకు ఒక్కో దుకాణానికి రూ.3 వేల చొప్పున మామూళ్లు ఇవ్వాలని ఈఎస్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మామూళ్లు ఇవ్వకుంటే ఎక్సైజ్ యాక్డు కింద కేసు నమోదు చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఎనిమిది నెలల మామూళ్లు రూ.72 వేలు ఇవ్వాలని రవీందర్‌రెడ్డిపై ఈఎస్ ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం రూ.30 వేలు ఇవ్వాలని తెలుపడంతో రవీందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను వారం రోజుల క్రితం ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం ఈఎస్‌కు తన చాంబర్‌లో రవీందర్‌రెడ్డి రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అనంతరం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ప్రతి మద్యం దుకాణం నుంచి నెలనెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. వైన్స్‌షాపుల నుంచి డబ్బులు తీసుకురావాలని సబార్డినేటర్లపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. ఈ దాడుల్లో జిల్లా ఏసీబీ ఇన్‌చార్జి వివి రమణమూర్తి, కరీంనగర్ ఏసీబీ సీఐ శ్రీనివాస్‌రాజ్ పాల్గొన్నారు. కాగా, మద్యం వ్యాపారి రవీందర్‌రెడ్డి కావాలనే తనపై కక్షతో ఏసీబీ అధికారులకు పట్టించాడని ఈఎస్ విజయ భాస్కర్‌రెడ్డి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement