భూగర్భ, గనుల శాఖ రాజమహేంద్రవరం కార్యాలయంలో ఏడీఈగా పనిచేస్తున్న రౌతు గొల్ల అక్రమ ఆస్తులు
రాజమహేంద్రవరం క్రైం : భూగర్భ, గనుల శాఖ రాజమహేంద్రవరం కార్యాలయంలో ఏడీఈగా పనిచేస్తున్న రౌతు గొల్ల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏడాది మే 27న రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని ఒక గ్రానైట్ భూమిని లీజుకు ఇచ్చేందుకు చిరంజీవిరావు అనే రైతు వద్ద నుంచి మైన్స్ ఏడీఈ గొల్ల రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు గొల్ల ఇంట్లో సోదాలు నిర్వహించి 1 కేజీ బంగారం రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గొల్లపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తాజాగా మంగళవారం విజయవాడలో మూడు చోట్ల, రాజమహేంద్రవరంలోని రెండు చోట్ల సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో రాజమండ్రిలో 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో రెండు అంతస్తుల భవనాలు రెండు, మూడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలు, ఒక కారును అధికారులు గుర్తించారు. అలాగే మరో స్థలం కొనేందుకు రూ. 50 లక్షలు అడ్వాన్సు ఇచ్చినట్టు పత్రాలు, ఇతరులకు రూ.20 లక్షల వరకూ అప్పులు ఇచ్చినట్టు లభ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ. 2 కోట్లు ఉంటుందని, మార్కెట్ రేటు ప్రకారం రూ. ఆరు కోట్లు వరకూ ఉండవచ్చునని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.