ఆర్టికల్‌ 370 రద్దు భారతావనికి వరం

Abolition of Article 370 is a Gift to India - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభినందనలు

కశ్మీర్‌లో సరస్వతి పీఠం పునరుద్ధరించాలి

విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి: భారతదేశంలో జమ్మూకశ్మీర్‌ ఒక అవిచ్ఛిన్న అంతర్భాగమయ్యేలా, దేశం కల సాకారమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం అమోఘమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసించారు. ఆర్టికల్‌ 370 రద్దు దేశానికి అత్యంత ఆవశ్యకమన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రుషికేష్‌ గంగానదీ తీరంలోని శారదాపీఠంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి చాతుర్మాస దీక్ష ఆచరిస్తున్న స్వామీజీ.. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయంపై స్పందించారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం దిశగా సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా బిల్లును తీసుకురావడం సాహసమైన, సమర్థమైన నిర్ణయమన్నారు.

మంచుకొండల కశ్మీరంలో చల్లనితల్లి సరస్వతి శక్తిపీఠం నెలకొని ఉందని, ఆ తల్లిని దర్శించుకునేందుకు దేశంలోని కోట్లాది మంది భక్తులకు మోదీ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కశ్మీర్‌లో సరస్వతి పీఠం పునరుద్ధరణ జరగాల్సి ఉందని, ఇందుకు భారత సర్కారు పూనుకుని ముందుకొస్తే శారదాపీఠం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రామజన్మభూమి విషయంలోనూ ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. గో రక్షణకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోవును భారతదేశ అధికార ఆధ్యాత్మిక చిహ్నంగా ప్రకటించాలని కోరారు. కశ్మీర్‌పై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందనలు తెలియజేస్తూ స్వామీజీ మంగళశాసనాలు అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top