
ప్రత్యేక హోదా డిమాండ్‌తో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, సంబంధిత అధికారులు హామీ ఇవ్వాలని కోరుతూ ఉదయం 9.30 గంటలకు సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి కిందకు దిగకపోవడంతో ఉత్యంఠ కొనసాగుతోంది.
- పదిగంటలుగా సాగుతున్న ఆందోళన
పెదకాకాని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, సంబంధిత అధికారులు హామీ ఇవ్వాలని కోరుతూ ఉదయం 9.30 గంటలకు సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి కిందకు దిగకపోవడంతో ఉత్యంఠ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని గుంటూరు ఆటోనగర్ సమీపంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, మైక్రోవేవ్ బిల్డింగ్ ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ రోడ్డు పక్కనే ఉన్న మైక్రోవేవ్ బిల్డింగ్ వెనుక ఉన్న సెల్‌టవర్‌పైకి గుంటూరు సీతానగరానికి చెందిన మామిళ్ళపల్లి సంజీవరావు ఎక్కారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటలకు ఆఫీసు సిబ్బంది వచ్చారు.
అప్పటికే టవర్ ఎక్కిన సంజీవరావు అతని స్నేహితుడు పిచ్చయ్యనాయుడుకు సమాచారం అందజేయడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. వారు తెలిపిన సమాచారంతో పెదకాకాని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంజీవరావు మాత్రం అతని స్నేహితుడు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఒక్కరితోనే మొదలైందని, చిన్నతనం నుంచి ఒక మంచిపని చేయాలనే కోరిక ఉంది. నా చావుతో నైనా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందని 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని, తన బార్య పిల్లలు బాధ పడుతున్నారు జాగ్రత్త అంటూ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాడు.
సంజీవరావుకు బార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, పార్లపల్లికి చెందిన సంజీవరావు ఎమ్మెస్సీ వరకూ చదువుకున్నాడు. ఏడాది క్రితం గుంటూరు చేరుకుని సూర్యా కన్సల్టెన్సీ పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పెదకాకాని సీఐ కాకర్ల శేషారావు, ఎస్‌ఐ పి కృష్ణయ్య, అగ్నిమాపకశాఖ అధికారులు, గుంటూరు తహశీల్ధార్ మూర్తి ఆయన్ను క్షేమంగా కిందకు దించేందుకు బుజ్జగిస్తున్నారు. ఇంకా ఆయన కిందకు దిగలేదు.
బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం మద్ధతుదారుల ధర్నా
పలువురు మద్దతు దారులు కార్యాలయం ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. అనంతరం రోడ్డు పైకి చేరుకుని ధర్నా చేయడంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంతో కూడిన ఆందోళనలు మంచిది కాదని, క్షేమంగా కిందికి దిగిరావాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.