‘జీవిత'oలోకి.. స్వేచ్ఛగా.. | 82 people were on the enjoyment of the freedom of life sentence | Sakshi
Sakshi News home page

‘జీవిత'oలోకి.. స్వేచ్ఛగా..

Dec 23 2013 1:47 AM | Updated on Sep 17 2018 5:36 PM

జీవిత ఖైదును అనుభవించిన 82 మందికి ఆదివారం స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష జీవోతో వారంతా స్వేచ్ఛా ప్రపంచంలో జీవనంలోకి వచ్చారు. క్

బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : జీవిత ఖైదును అనుభవించిన 82 మందికి ఆదివారం స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష జీవోతో వారంతా  స్వేచ్ఛా ప్రపంచంలో జీవనంలోకి వచ్చారు. క్షణికావేశంలోనో, ఉద్దేశ్య పూర్వకంగానో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా జీవిత ఖైదును అనుభవిస్తూ పశ్చాత్తాపంతో.. మానసిక పరివర్తన చెందారు. వీరి సత్ప్రవర్తనను గుర్తించి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. వీరి విడుదలతో వారిని కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు తరలి వచ్చారు.
 
 మండల పరిధిలోని జిల్లా ఓపన్ ఎయిర్ జైలు ఈ దృశ్యాలకు వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది ఖైదీలు విడుదల కాగా, వీరిలో అనంతపురం ఓపన్ ఎయిర్ జైలు నుంచి అత్యధికంగా 82 మంది విడుదలయ్యారు. రాజమండ్రిలో మొత్తం 74 మంది ఖైదీలు విడుదలయ్యారని సూపరింటెండెంట్ లక్ష్మీపతి తెలిపారు. కాగా ఖైదీలు జైల్లో ఉండగా వారి కోసం ప్రభుత్వం రోజుకు రూ.50 చెల్లించేది. ఆ సొమ్మును అధికారులు పొదుపు చేసేవారు. అది మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. ఆ డబ్బును జైలు అధికారులు ఖైదీలకు అందజేశారు. తమ వాళ్లకు ఇళ్లకు తీసుకెళ్లడానికి బంధువులు, అనుచరులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారంతా విడుదలైన ఖైదీలను ఆప్యాయంగా పలకరించి, ఉద్వేగం, ఆప్యాయత, ప్రేమానురాగాలు నిండిన హృదయాలతో హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు.
 
 కాగా విడుదలైన వారిలో అధిక శాతం సంపన్నులు, రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో సంబంధిత నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల్లో చేరుకున్నారు. జైలు సూపరింటెండెంట్ లక్ష్మీపతి ఖైదీలందరికీ విడుదల పత్రాలు(రిలీజింగ్ ఆర్డర్) ఇచ్చారు. వాటిని తీసుకుని బయటకు రాగానే ఆనందోత్సాహాలతో వారిని తమ వెంట ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు తిమ్మంపల్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి వీఆర్.రామిరెడ్డి, టీడీపీ నాయకులు కంది గోపుల మురళీప్రసాద్, కడప, కర్నూలుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, తదితరులు తరలి వచ్చి విడుదలైన వారిని పరామర్శించారు.
 
 ల్యాబ్ టెక్నీషియన్‌గానే
 కొనసాగుతా...
 మొదట కర్నూలులో ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రయివేటు క్లీనిక్ నిర్వహిస్తుండేవాడిని. అనుకోని పరిస్థితుల వల్ల జైలుకు వచ్చాను. ఇపుడు మా ఊరెళ్లి బ్యాంక్ ద్వారా రుణం పొంది మళ్లీ ల్యాబ్ టెక్నీషియన్‌గానే జీవితాన్ని కొనసాగుతాను.     
 -  విజయమోహన్(కర్నూలు జిల్లా)
 
 రాజకీయాల వల్ల నష్ట పోయాం
 రాజకీయాల వల్ల ఎంతో నష్ట పోయాం. తాడిపత్రిలో ఓ కాంగ్రెస్ నాయకుడి కారణంగా పదేళ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. బయటకు వెళ్లి ప్రశాంతంగా జీవిస్తాను, కుటుంబానికి దూరమై ఎంతో కుంగిపోయాను.
 - ఆలూరి రామచంద్రారెడ్డి, సీంగిల్ విండో మాజీ అధ్యక్షుడు
 
 ఆవేశం వల్ల అనేక అనర్థాలు
 ఆవేశాల వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని అనుభవ పూర్వకంగా తెలిసింది. కోపతాపాల వల్ల ఎంతో నష్ట పోయాం.ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనంతో జీవించాలి. ఆవేశం కారణంగా మా కుటుంబంలో నాతో పాటు మరో ముగ్గురు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
 -  రాజగోపాల్‌రెడ్డి, జీవిత ఖైదీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement