సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధానికి పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధానికి పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీస్థాయిలో సమాయత్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి క్షేత్ర స్థాయి ఆందోళనలు చేపడుతున్న పార్టీ శ్రేణులు బుధ, గురువారాల్లో జిల్లా నలుమూలల జాతీయ రహదారులతోపాటు ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం అన్ని నియోజక వర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు నియోజక వర్గ స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించారు.
ఇందులో భాగంగా ఆయా తేదీల్లో ఉదయం నుంచే పాయకరావుపేట నియోజక వర్గ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారి మొదలు విజయనగరం జిల్లా వరకు ఉన్న హైవేపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేతలు
నిర్ణయించారు. అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, గాజువాక నియోజక వర్గాల పరిధిలోని జాతీయ రహదారిని ఉదయం నుంచే దిగ్బంధించాలని తీర్మానించారు. ప్రతి నియోజక వర్గంలో పార్టీ నేతలతో పాటు, అభిమానులు, సమైక్యాంధ్రను కాంక్షించే ప్రజా సంఘాలు, ఎన్జీవో సంఘాలతో కలిసి ఆందోళనలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఇప్పటికే దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఎన్జీవోలతోపాటు పలు ప్రజాసంఘాలు పార్టీతో కలిసి రహదారుల ముట్టడికి మద్దతు పలికాయి. దీంతో బుధ, గురువారాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు మరింత తీవ్రతరం కానుంది. వైఎస్సార్‌సీపీ నిర్వహించే ఆందోళనలకు ఎక్కడికక్కడ సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు పార్టీ నేతలు వివరించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కదిలే ప్రతి ఒక్కరు ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కీలక కార్యక్రమం విజయవంతం కావడానికి ఇప్పటికే నియోజక వర్గ సమన్వయకర్తలు ఆయా మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆందోళనల్లో భాగస్వామ్యం కావడానికి సమాయత్తం చేశారు.
నగరంలోని నాలుగు నియోజక వర్గాల్లో భారీ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ వాహనాలతోపాటు అన్నింటిని ఉదయం నుంచే దిగ్బంధించి సమైక్యాంధ్ర కాంక్షను అందరిలో మరింత రగిలించేలా కార్యాచరణ రూపొందించారు. పార్టీ జెండాలతోపాటు విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో ప్రత్యేక బ్యానర్లు సిద్ధం చేశారు.