గల్లంతై పదేళ్లు..ధ్రువీకరణకు ఇంకెన్నేళ్లు?

గల్లంతై పదేళ్లు..ధ్రువీకరణకు ఇంకెన్నేళ్లు?


 పిఠాపురం :ఆచూకీ లేని మేరుగు మసేనుకు భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కోడ తాతబాబుకు అప్పటికిఐదు నెలల క్రితమే వివాహమైంది. తిర్రి మరిడియ్య, నూకరాజు తండ్రీకొడుకులు. వారిద్దరి కోసం బెంగ పెట్టుకున్న మరిడయ్య భార్య కాశమ్మ అదే బాధతో మరణించింది. ప్రకాష్‌కు భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉండగా, తిర్రి కొండయ్యకు భార్య కొయ్యమ్మ, మేరుగు కొండయ్యకు భార్య కొండమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పదేళ్లుగా వారి కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడ్డాయి.

 

 పదేళ్లయినా ధ్రువీకరణ లేదు

 అప్పట్లో కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఏడుగురు మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయి పదేళ్లయినా, వారు చనిపోయినట్టుగా ఇప్పటికీ అధికారులు ధ్రువీకరించలేదు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందలేదు. సాధారణంగా సముద్రంలో ఎవరైనా ఆచూకీ లేకుండా పోతే ఏడేళ్ల అనంతరం వారు చనిపోయినట్టుగా అధికారులు ధ్రువీకరిస్తారు. తద్వారా ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుంది. ఈ ఏడుగురి విషయంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

 తూతూమంత్రంగా సాయంఆచూకీ లేకుండా పోయిన ఐదో రోజు రూ.ఐదు వేలు, మూడు నెలల అనంతరం రూ. ఐదు వేలు, మూడేళ్ల అనంతరం రూ.40 వేల ఆర్థికసాయం అందించిన అధికారులు.. ఏడేళ్ల తర్వాత వారు చనిపోయినట్టు ప్రకటించి, పూర్తి ఆర్థికసాయం అందిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ పదేళ్లయినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 మాగోడు వినే నాథుడు లేడు

 మా వాళ్ల ఆచూకీని గుర్తించాలని, లేకుంటే వారు చనిపోయినట్టుగానైనా ప్రకటించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా, వారు పట్టించుకోవడం లేదు. ఏ దిక్కూ లేక, అయిన వారు దూరమై మానసిక వేదనతో అలమటిస్తున్నాం. అన్నీ కోల్పోయి వీధులపాలయ్యాం.

 - తిర్రి కొయ్యమ్మ, సుబ్బంపేట

 

 ఆ ఏడుగురు వీరే..

 అది 2004 జూన్ రెండో తేదీ. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మేరుగు మసేను (45), కోడ తాతబాబు(22), తిర్రి మరిడియ్య(53), తిర్రి నూకరాజు(18), మారిపల్లి ప్రకాష్(25), తిర్రి కొండయ్య, మేరుగు కొండయ్య అనే మత్స్యకారులు మేరుగు సుబ్బారావు బోటుపై చేపల వేటకు వెళ్లారు. సొర చేపల వేటకు సముద్రంలోకి వెళితే ఐదు రోజులకు కాని, తీరానికి చేరే అవకాశం లేదు. తుపాను రావడంతో అన్ని బోట్లు తీరానికి చేరుకోగా, వీరి బోటు మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు.

 

 మాకు న్యాయం చేయండి

 కుటుంబ ఆసరా కోల్పోయాం. హామీలు ఇచ్చిన వారు కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. మా బతుకులు దుర్భరమయ్యాయి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. బోటు గల్లంతైతే బీమా ఇస్తున్నారు. మనుషులు పోతే పట్టించుకోవడం లేదు.

 - మారిపల్లి పద్మ, సుబ్బంపేట

 

 మా బతుకులు అగమ్య గోచరమే

 కుటుంబ యజమాని అదృశ్యమైపోయాడు. మేము వీధుల పాలయ్యాం. అయినా కనికరించే నాధుడు కనిపించడం లేదు. ఎవరికి చెప్పుకున్నా విని వదిలేస్తున్నారు. ఇక ప్రభుత్వం పట్టించుకోకపోతే మా బతుకులు అగమ్యగోచరమే.

 - మేరుగు నాగమణి,

 బాధితురాలు సుబ్బంపేట.

 

 ఆచూకీ చెబుతారా..ఆసరా కల్పిస్తారా?

 ప్రభుత్వ తీరు మమ్మల్ని కలిచివేస్తోంది. మొదట్లో నాయకులు అధికారులు వచ్చి మీ కుటుంబాలను ఆదుకుంటామంటూ వాగ్దానాలు చేశారు. పదేళ్లయినా మావాళ్ల ఆచూకీ లేదు. ఇప్పటికైనా అధికారులు మావాళ్ల ఆచూకీ అయినా తెలపాలి లేదా మాకు ఆసరా కల్పించాలి.

 - మేరుగు కొండమ్మ,

 బాధితురాలు, సుబ్బంపేట.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top