108 కష్టాలు

108 Vehicles Damaged And Services Delayed In West Godavari - Sakshi

జిల్లాలో పరిస్థితి దారుణం

ఘటనా స్థలానికి వచ్చేందుకు గంటల సమయం

పూర్తిస్థాయిలో లేని వాహనాలు

మరమ్మతులతో మూలకు చేరుతున్న మరికొన్ని..

పశ్చిమగోదావరి, భీమవరం (ప్రకాశం చౌక్‌): ఫోన్‌ చేసిన నిమిషాల వ్యవధిలో కూయ్‌.. కూయ్‌.. కూయ్‌.. మంటూ ప్రమాద స్థలానికి చేరుకునేది 108 వాహనం ఇది ఒకప్పటి మాట.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన 108 సేవలు దేశవ్యాప్తంగా పేర్గాంచాయి. పేదలకు విశేష సేవలందించాయి. అత్యవసర సేవలందించడంలో 108కు పురస్కారాలు కూడా దక్కాయి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ సేవల పరిస్థితి దారుణంగా ఉంది. ఫోన్‌ చేసినా సంఘటనా స్థలానికి వచ్చేందుకు గంటల సమయం పడుతోంది. చాలీచాలనీ వాహనాలు, మరమ్మతులు, నిధుల లేమితో వాహన సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 108 సేవలపై నిర్లక్ష్యం వహించడమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ఆపదలో ఉండి 108 కోసం ఎదురుచూసే పలువురు క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సంఘటనలు ఉన్నాయి.

జిల్లాలో అమలు తీరు అధ్వానం
జిల్లాలో 108 పథకం అమలు తీరు దారుణంగా ఉంది. అత్యవసర సేవలు అందించాల్సిన 108 వాహనాలు మరమ్మతుల బారినపడితే వాటిని సరిచేయించేందుకు నెలలు గడిచిపోతున్నాయి. చిన్నపాటి మరమ్మతులకు కూడా నోచుకోకపోవడంతో పలు వాహనాలు మూలనపడుతున్నాయి. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

జిల్లాలో 30 మాత్రమే..
జిల్లాలో 37 వాహనాలకు గాను ప్రస్తుతం 30 వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. వాహనాల కొరతతో ప్రమాద స్థలానికి చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. జిల్లాలో ఆకివీడు, ఉండి, కాళ్ల, పెనుమంట్ర, దెందులూరు, పాలకోడేరు మండలాలకు 108 వాహనాలు లేవు. ఆయా గ్రామాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సేవలకు వాహనాలు వచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. భీమవరంలోని 108 వాహనం భీమవరం మండలంతో పాటు పాలకోడేరు, ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాలకు సేవలు అందించాల్సి వస్తోంది. భీమవరం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర కేసులను వైద్యులు ఈ వాహనంలోనే ఏలూరు పంపిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఒకే సమయంలో రెండు, మూడు అత్యవసర కేసులు వస్తే మెరుగైన సేవలు అందడం కష్టమవుతోంది. 

సిబ్బంది ప్రవర్తనతో ఇబ్బందులు
గతంలో ఆపదలో ఉన్న వారిని చూసి 108కి సమాచారం ఇస్తే హుటాహుటిన వచ్చిన ఆస్పత్రికి తరలించేవారు. అయితే ప్రస్తుతం కొందరు 108 సిబ్బంది ప్రమాదం సమాచారం ఇచ్చే వారి పేరు, చిరునామా, క్షతగ్రాతుల పేర్లు, ఆధార్‌ నంబర్లు వంటి వివరాలు అడిగి ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాచారం ఇచ్చే వారి వివరాలు చెప్పనవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా 108 సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు.  

కొత్త వాహనాల కోసం ప్రతిపాదించాం
జిల్లాకు 108 వాహనాలను కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించాం. అలాగే పాత 108 వాహనాలను మరమ్మతులు చేయిస్తున్నాం. ఎక్కడైనా సిబ్బంది సమాచారం ఇచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – ఈ.రాజ్‌కుమార్, 108 జిల్లా విభాగం మేనేజర్, ఏలూరు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top