లోకల్ రైలు బోగీల పెకైక్కి స్టంట్లుచేసే ఆకతాయిలు రైల్వే పోలీసులకు తలనొప్పిగా మారారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీరిలో మార్పు రావడం లేదు.
1,243 మందిని అదుపు లోకి తీసుకున్న రైల్వే పోలీసులు
Aug 15 2013 6:36 AM | Updated on Sep 1 2017 9:51 PM
లోకల్ రైలు బోగీల పెకైక్కి స్టంట్లుచేసే ఆకతాయిలు రైల్వే పోలీసులకు తలనొప్పిగా మారారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీరిలో మార్పు రావడం లేదు. పైనున్న ఓవర్ హెడ్ వైరు (ఓహెచ్‌డబ్ల్యూ) తగిలి ప్రాణాలు కోల్పోతున్నా స్టంట్ మాస్టర్ల విన్యాసాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మూడు రోజుల కిందట బోగీపెకైక్కి ప్రయాణిస్తున్న ఓ యువకుడు పెంటాగ్రాఫ్‌లో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. తాజాగా జరిగిన సంఘటనతో రైల్వే పోలీసులు అప్రమత్తమై ఈ మూడు రోజుల్లో హార్బర్ మార్గంలో 12 మంది స్టంట్ మాస్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి మూడేళ్లలో 1,243 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పట్టుబడిన స్టంట్ మాస్టర్లలో అత్యధిక శాతం హార్బర్ మార్గంలోని మాన్‌ఖుర్ద్, గోవండీ, రే రోడ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు చెందిన యువకులే ఉన్నారు. నగరంలో పశ్చిమ, సెంట్రల్, హార్బర్ ఇలా మూడు వేర్వేరు రైల్వే మార్గాలున్నాయి. గత ఆదివారం పన్వేల్ నుంచి సీఎస్టీ దిశగా వస్తున్న లోకల్ రైలులో బోగీపెకైక్కి ప్రయాణిస్తున్న సమ్‌షేర్ ఆలం (19) తిలక్‌నగర్ స్టేషన్ వద్ద పెంటాగ్రాఫ్‌లో చిక్కుకుని చనిపోయాడు. అంతకు ముందు మహ్మద్ ఇల్యాస్ (18) డోరు దగ్గర నిలబడి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ముఖ్యంగా హార్బర్ మార్గంలో ప్రతీరోజు ఇద్దరు లేదా ముగ్గురు డోరు దగ్గర నిలబడి స్టంట్స్ చేస్తూ కనబడుతుంటారు.
మరికొందరు పెకైక్కి ప్రయాణిస్తుంటారు. సెంట్రల్, పశ్చిమ మార్గాల్లో ఇలాంటి దృశ్యాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట మాన్‌ఖుర్ద్-వడాల స్టేషన్ల మధ్య 50 మందికి పైగా యువకులు స్టంట్లుచే స్తూ తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసు బలగాలు ఒకే నెలలో 200పైగా స్టంట్ వీరులను పట్టుకున్నారు. అదేవిధంగా వీరిని అదుపుచేసేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా నియమించారు. వడాల రైల్వే పోలీసులు ఈ ఏడు జనవరిలో ఏకంగా 112 మంది స్టంట్ వీరులను పట్టుకున్నారు. దీంతో కొద్దిరోజులపాటు వీరి సంఖ్య తగ్గిపోయింది. కాని ఇటీవల మళ్లీ రెచ్చిపోవడం మొదలైంది.
రైల్వే నియమాలు...
రెండు బోగీల మధ్య నిలబడి ప్రయాణించడం, డోరువద్ద నిలబడి లేదా కిటికీని పట్టుకుని వేలాడుతూ స్టంట్లు చేయడం, రైలు నడుస్తుండగా ప్లాట్‌ఫారంపై కాలు ఆనిస్తూ స్కేటింగ్ చేయడం, రెండు ట్రాక్‌ల మధ్య ఏర్పాటుచేసిన ఇనుప కంచెపై నిలబడి ప్రాణాంతక విన్యాసాలు చేయడం లాంటివి రైల్వే నిబంధనల ప్రకారం నేరమే అవుతుంది. పట్టుబడినవారికి జరిమానా, కఠిన చర్యలు తీసుకోవాలని నియమాలున్నాయి. కాని ఆర్పీఎఫ్ వద్ద తగినంత సిబ్బంది లేకపోవడంతో కేవలం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఈ స్టంట్ మాస్టర్లను అదుపులోకి తీసుకోగలుగుతున్నారు. ఆ తరువాత వారిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో పేట్రేగిపోతున్నారు.
Advertisement
Advertisement