భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య. ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో
కేసు నేపథ్యం
కోర్టు రికార్డుల ప్రకారం.. భార్య పిల్లలు, పుట్టింట్లో ఉండగా భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఇక్కడ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.
మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.
ఎక్సెప్షన్ 4 అంటే ఏమిటి?
ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?
క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.
అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా? కానే కాదు... గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత, నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి.


