ఎవరిపై మీ సమరం?: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy extremely angry with leaders of employee unions | Sakshi
Sakshi News home page

ఎవరిపై మీ సమరం?: సీఎం రేవంత్‌

Published Tue, May 6 2025 1:32 AM | Last Updated on Tue, May 6 2025 5:37 AM

CM Revanth Reddy extremely angry with leaders of employee unions

ఉద్యోగాలిచ్చి జీతాలిస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? 

ఉద్యోగ సంఘాల నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

తనను కోసినా రూపాయి రాదని.. ఎక్కడా అప్పు పుట్టడం లేదని స్పష్టీకరణ 

బయట ఎవడూ మనల్ని నమ్మడం లేదని.. పూర్తిగా దివాలా తీశామని కుండబద్దలు 

నన్ను కోసుకొని వండుకొని తింటారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు 

అప్పుల కుప్పచేసి ఫామ్‌హౌస్‌లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడని కేసీఆర్‌పై విమర్శలు 

ఉద్యోగుల సమ్మె ప్రకటనలపై పోలీస్‌ అవార్డుల కార్యక్రమంలో విరుచుకుపడ్డ సీఎం 

పార్టీల ఉచ్చులో పడొద్దని హితవు..

చర్చలకొస్తే లెక్కలు చెప్తానని వెల్లడి 

శాంతిభద్రతలు బాగున్నందునే పెట్టుబడులొస్తున్నాయని పోలీసులకు కితాబు

ఈ సమయంలో సమరం కాదు..సమయస్ఫూర్తి కావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను మనవి చేస్తున్నా. మనమంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపునకు అప్పగించొద్దు. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించుకుందాం 
– సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదల్చుకున్నరు? ఎవరిని కొట్టదల్చుకున్నరు? ఉద్యోగా లిచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ యుద్ధం? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్లు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం. సమరం చేయడానికి లేము. 

ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన ‘తెలంగాణ పోలీస్‌ రియల్‌ హీరోస్‌ జీ అవార్డులు’ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 22 మంది పోలీస్‌ సిబ్బంది, అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 

నన్ను కోసినా రూపాయి రాదు.. 
‘ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు. ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారవద్దని ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని.. ప్రభుత్వం సాఫీగా నడవొద్దని కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటది. 

మీరు వాళ్ల ఉచ్చులో పడి వాళ్ల చేతుల్లో పావులుగా మారొద్దు. రాజకీయ నాయకుల చేతుల్లో చురకత్తుల్లా మారి ప్రజల గుండెల్లో గుచ్చితే అది గాయంగా మారుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా రాదు. నెలకు రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. వాస్తవ పరిస్థితి ఇది. మరి నన్ను ఏం చేస్తరు? నన్ను కోసుకొని వండుకొని తింటరా?’అని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

దుబారా తగ్గిస్తున్నా.. 
‘ఉద్యోగుల జీతాలు, ఫించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా రూ. 22,500 కోట్లు కావాలి. ప్రభుత్వానికి వస్తున్న రూ. 18,500 కోట్లలో ప్రతి నెలా అప్పులకు రూ. 7 వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు రూ. 5,500 కోట్లు పోను నా దగ్గర మిగిలేవి రూ. 6 వేల కోట్లు. దీనిలో ఏయే పథకాలు అమలు చేయాలి? అవకాశం ఉన్న ప్రతి దగ్గర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. సీఎం హోదాలో ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానం తీసుకెళ్లే వెలుసుబాటు ఉన్నా మామూలు విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసే వెళ్తున్నా. దుబారా తగ్గిస్తున్నా’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

ఏది ఆపమంటారో మీరే ప్రజలకు చెప్పండి..  
‘మీ కోరికలు తీర్చాలంటే ఏం చేయాలి? కావాలంటే నేనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తా. 10 లక్షల మందిని కూడా తీసుకొస్తా. ఇట్లా చేస్తే బాగుంటదని సభలో మీ ఉద్యోగుల సంఘాల నాయకులే మాట్లాడండి. ఏ పథకం ఆపాలో మీరే ప్రజలకు చెప్పండి. ఫలానా పథకం ఆపేసి మేం జీతాలు పెంచుకుంటాం. బోనస్‌లు తీసుకుంటాం. మేం తిన్నాక మిగిలిందే మీకు ఇస్తామని ప్రజలకు చెప్పండి. లేదంటే రూ. 100 ఉన్న పెట్రోల్‌ రూ. 200 చేద్దామా? బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ధరలు రెండింతలు చేద్దామా? మీరే చెప్పండి. 

ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. నిరసనలు, ధర్నాలు, బంద్‌లు చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. నాకు పోయేది కూడా ఏమీ లేదు. చిన్న గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే ప్రజలు నాకిచి్చన గొప్ప గౌరవం అనుకుంటా. ఆ గౌరవం బతికి ఉన్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టేందుకు పనిచేస్తా’అని సీఎం రేవంత్‌ చెప్పారు. 

అప్పంతా బకాయిలకే.. 
‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తెచి్చన అప్పు రూ. 1.58 లక్షల కోట్లు. అందులో రూ. 1.52 లక్షల కోట్లు పాత అప్పులు, అసలు, మిత్తికి చెల్లించాం. గత ప్రభుత్వం మొత్తం రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు పెట్టిపోయింది. మేం తెచ్చిన అప్పులో సొమ్మంతా పాత బకాయిలకు పోయింది తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఈ 16 నెలల్లో సరాసరిన నెలకు రూ. 9 వేల కోట్లు చెల్లించుకుంటూ వస్తున్నా. 

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుందనే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు మూడేళ్లు పెంచింది. ఇప్పుడు రిటైరవుతున్న వాళ్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కింద రూ. 8,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. వాటిని ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. అదనంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 500 బోనస్, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్లు, పేదల ఇళ్లకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 16 నెలల్లో కేవలం రైతులకే రూ. 30 వేల కోట్లను వాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశా’అని సీఎం పేర్కొన్నారు. 

బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే దొంగల్లా చూస్తున్నరు.. 
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పు పుడతలేదు. బ్యాంకర్లను కలిసేందుకు వెళ్తే తెలంగాణ ప్రతినిధులను దొంగల్లా చూస్తున్నరు. ఢిల్లీకి పోతే అపాయింట్‌మెంట్‌ కూడా ఇస్తలేరు. దేశం ముందు తెలంగాణది ఆ పరిస్థితి ఉంది. కుటుంబ పరువు తీయొద్దని కుటుంబ పెద్దగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ లెక్కలు కావాలంటే ఆర్థికశాఖ అధికారుల వద్ద కూర్చొని చూడండి’అని సీఎం రేవంత్‌ ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. 

కేసీఆర్‌ది పైశాచిక ఆనందం.. 
‘డైలీ ఫైనాన్స్‌లో రూ. 10 మిత్తికి తెచ్చుకొనే వాడికంటే అద్వానంగా అప్పులు తెచి్చపెట్టిండు ఆయన (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి). రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మీ సావు మీరు సావండని హ్యాపీగా ఫాంహౌస్‌లో దుప్పటి కప్పుకొని పడుకుండు. మూడు నెలలకొకసారి బయటికి వచ్చి అది ఫెయిల్‌.. ఇది ఫెయిల్‌ అని తిడతడు. రైతుబంధు ఫెయిల్‌ అని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పేటప్పుడు బాధతో కాదు.. ఆయన ముఖం వెయ్యి వోల్టుల బుల్బులా వెలుగుతది. ఇదేం పైశాచిక ఆనందం?’అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. 

నిమిషం నిర్లక్ష్యంగా ఉన్నా పోలీస్‌ శాఖకు చెడ్డపేరు.. 
‘శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం. శాంతిభద్రతలు బాగున్నందునే 16 నెలల్లో రూ. 2.28 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగాం. దీనంతటికీ కారణం పోలీస్‌ శాఖ అని నేను గర్వంగా చెబుతున్నా. విధుల్లో ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా మొత్తం పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపి అణచివేయాలి, సైబర్‌ నేరాలను నియంత్రించాలి. 

పోలీస్‌శాఖకు అవసరమైన పూర్తి సహకారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్‌ సహా నగరాల్లో పోలీసులు చేపడుతున్న డ్రగ్స్‌ కట్టడి గ్రామీణ ప్రాంతాల్లోనూ పక్కాగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement