నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు | Worry About That: Harsha Bhogle On Auqib Nabi Non Selection In Test Team | Sakshi
Sakshi News home page

నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు

May 21 2026 6:21 PM | Updated on May 21 2026 6:29 PM

Worry About That: Harsha Bhogle On Auqib Nabi Non Selection In Test Team

PC: BCCI/X

టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ (జూన్‌ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.

గుర్నూర్‌ బ్రార్‌కు తొలిసారి పిలుపు 
ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్‌ బ్రార్‌ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణతో కలిసి పేస్‌ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్‌ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.

కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్‌ నబీ పట్ల సెలక్షన్‌ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్‌ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్‌ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.

అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?
అతడి బౌలింగ్‌లో తగినంత పేస్‌ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్‌ లభించేది.

టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్‌ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా లేవు.

ఏం మెసేజ్‌ ఇస్తు న్నారు?
దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్‌ కమిటీకి ఆకిబ్‌ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. 

కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్‌లో పది మ్యాచ్‌లలో ఆకిబ్‌ నబీ జమ్మూ కశ్మీర్‌ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్‌.. 44 వికెట్లతో సత్తా చాటాడు.

చదవండి: నితీశ్‌ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్‌.. పాపం పంత్‌!.. కొత్త ముఖాలు ఇవే

Advertisement
 
Advertisement
Advertisement