
Photo Courtesy: BCCI
చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో సోమవారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) పవర్ ప్లేలో అద్భుతమే చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే
ఉప్పల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రమాదకర ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డుప్లెసిస్ (3)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వచ్చీరాగానే పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు.
Wickets ✅
Catch ✅
Captaincy ✅
Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025
స్టబ్స్ దంచేశాడు
ఇక మిగతా వాళ్లలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (10) వికెట్‌ను జయదేవ్ ఉనాద్కట్ దక్కించుకోగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (6) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. విప్రాజ్ నిగమ్ అతడికి సహకరించాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ సంధించిన బంతిని ఆడిన స్టబ్స్.. విప్రాజ్‌తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు.
అయితే, మరో పరుగుకు కూడా ఆస్కారం ఉందని భావించి అందుకు ఉపక్రమించగా... విప్రాజ్ మాత్రం బ్యాటర్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. ఇంతలో స్టబ్స్ అతడి వైపుగా పరుగు తీయగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ అనికేత్ వర్మ జీషన్ వైపు విసిరాడు.
హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్
దీంతో వేగంగా స్పందించిన జీషన్ బౌలర్ ఎండ్ నుంచి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి స్టబ్స్ బ్యాటర్ ఎండ్ వైపు వెళ్లగా.. విప్రాజ్ మాత్రం మరో ఎండ్‌కు చేరలేకపోయాడు. ఈ క్రమంలో ఎవరు పరుగు పూర్తి చేశారని థర్డ్ అంపైర్ పరిశీలించగా స్టబ్స్ విప్రాజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో విప్రాజ్ మూల్యం చెల్లించకతప్పలేదు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు.
ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. విప్రాజ్ రనౌట్ కాగానే.. లేచి నిలబడిన ఆమె.. ‘‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. అంతేకాదు చప్పట్లతో తమ ఆటగాళ్లను అభినందించారు.
Stubbs செஞ்ச Mistake-க்கு Vipraj Wicket போய்டுச்சு😫
📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | SRH vs DC | JioHotstar & Star Sports தமிழில் #IPLOnJioStar #IPL2025 #TATAIPL #SRHvDC pic.twitter.com/YUmHK0745k— Star Sports Tamil (@StarSportsTamil) May 5, 2025
ఆశలు ఆవిరి
కానీ ఢిల్లీని నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకే పరిమితం చేశామన్న సన్‌రైజర్స్ ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే మొదలైన వాన.. ఉధృతం కావడంతో రైజర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. కమిన్స్ బృందానికి ఇంకా ఆశలు సజీవంగా ఉండేవి. ఇక ఈ మ్యాచ్‌లో స్టబ్స్ (41 నాటౌట్)తో పాటు అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41) రాణించడంతో ఢిల్లీ ఏడు వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.