పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో షాన్ మసూద్ బృందం మట్టికరిచిన సంగతి తెలిసిందే. రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లా పర్యటనకు వెళ్లిన పాక్.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది.
చిత్తు చిత్తుగా ఓడిన పాక్
తొలి టెస్టులో ఏకంగా 104 పరుగుల తేడాతో ఓడిపోయింది పాక్. ఇక బుధవారం ముగిసిన రెండో టెస్టులో బంగ్లా 78 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 316/7తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అతడే
చివరి రోజు 11.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 42 పరుగులు జోడించి చివరి 3 వికెట్లు కోల్పోయింది. మొహమ్మద్ రిజ్వాన్ (166 బంతుల్లో 94; 10 ఫోర్లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోగా...లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ 6 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ముష్ఫికర్ రహీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
ఈ విజయంతో బంగ్లా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరడం విశేషం. మరోవైపు.. పాకిస్తాన్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముస్తాక్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

మా చేతిలో పాక్ ఓటమి బాధించింది
బంగ్లాదేశ్ గెలుపు తనకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ.. అంతకంటే ఎక్కువగా పాక్ ఓటమి తనను బాధించిందని ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నాడు. కాగా ముస్తాక్ పాకిస్తాన్‌కు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. ఈ లెగ్ స్పిన్నర్ 1992లో వరల్డ్‌కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడు కూడా!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముస్తాక్‌ను తమ పురుషుల జట్టు స్పిన్‌బౌలింగ్ కోచ్‌గా 2024లో నియమించింది. అతడి మార్గదర్శనంలో బంగ్లా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సొంతగడ్డపై తొలిసారి పాక్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసింది బంగ్లాదేశ్.
గ్రూప్ ఫొటో కూడా దిగలేదు
ఈ నేపథ్యంలో విజయానంతరం ముస్తాక్ అహ్మద్ తన సొంత దేశపు జట్టు ప్రదర్శన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలెవంత్ అవర్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఒక కోచ్‌గా బంగ్లాదేశ్ ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ పాకిస్తాన్ ఓటమి నిరాశపరిచింది. చాలా చాలా బాధగా ఉంది.
పాకిస్తానీగా ఇలా నేను బాధపడటం సహజమే. నిజానికి పాక్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టుతో నేను గ్రూప్ ఫొటో కూడా దిగలేదు’’ అని ముస్తాక్ అహ్మద్ అన్నాడు. ఈ నేపథ్యంలో ముస్తాక్ తీరుపై బంగ్లాదేశ్ అభిమానులు మండిపడుతున్నారు. దేశం మీద అంత ప్రేమే ఉంటే.. అక్కడే కోచ్‌గా ఉండాల్సిందని.. బంగ్లా జట్టుతో గ్రూప్ ఫొటో దిగకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.
చదవండి: ODI WC 2027: రోహిత్ శర్మకు బై.. బై!.. అతడికి లైన్ క్లియర్!


