ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన ప్రకటన! | ECB Confirms Afghanistan Women Refugee Team Will Tour England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన ప్రకటన!

May 21 2026 9:08 PM | Updated on May 21 2026 9:08 PM

ECB Confirms Afghanistan Women Refugee Team Will Tour England

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సంచలన ప్రకటన చేసింది. అఫ్గనిస్తాన్‌ శరణార్థి మహిళా జట్టు తమ దేశ పర్యటనకు వస్తుందని తెలిపింది. ఈ టూర్‌ జూన్‌ 22 నుంచి మొదలుకానుందని పేర్కొంది.

ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా
ఇందులో భాగంగా అఫ్గన్‌ జట్టుకు టీ20 మ్యాచ్‌లకు సంబంధించి ఈసీబీ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అంతేకాదు.. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా అఫ్గన్‌ శరణార్థి జట్టు వీక్షిస్తుందని ఈసీబీ స్పష్టం చేసింది.

గొప్ప జ్ఞాపకంగా
ఎంసీసీ (మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌), ఎంసీసీ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఈ టూర్‌ కొనసాగుతుందని ఈసీబీ పేర్కొంది. ఈ విషయం గురించి ఈసీబీ డిప్యూటీ సీఈవో, మహిళల జట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్లేర్‌ కనోర్‌ మాట్లాడుతూ.. ‘‘2021లో అఫ్గనిస్తాన్‌ను వీడిన నాటి నుంచి..  అసాధారణ పట్టుదలతో తమ క్రికెట్‌ ప్రయాణాన్ని వారు కొనసాగిస్తున్నారు.

ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచి పోరాడుతున్నారు. ఈ పర్యటన వారికి గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుందని భావిస్తున్నాం. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా వారు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఈ టూర్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము’’ అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో
కాగా అఫ్గనిస్తాన్‌ (2021)లో తాలిబన్ల పాలన తిరిగి మొదలైన తర్వాత.. మహిళలపై ఆంక్షలు మళ్లీ పెరిగాయి. క్రీడలు, ప్రజా జీవితం నుంచి వారిని బహిష్కరించారు. ఈ క్రమంలో అఫ్గన్‌కు చెందిన దాదాపుగా ఇరవై మంది మహిళా క్రికెటర్లు దేశం విడిచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం వారంతా ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు సమాచారం. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లోని జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో 2025 జనవరిలో క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవన్‌ జట్టుతో అఫ్గన్‌ మహిళా జట్టు మ్యాచ్‌ ఆడింది. 

అంతేకాదు.. గువాహటిలో భారత్‌- శ్రీలంక మధ్య వన్డే వరల్డ్‌కప్‌-2025 ఆరంభ మ్యాచ్‌కు కూడా ఈ జట్టు హాజరైంది. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా అఫ్గన్‌ శరణార్థి జట్టు వెళ్లనుండటం విశేషం.

చదవండి: ODI WC 2027: రోహిత్‌ శర్మకు బై.. బై!.. అతడికి లైన్‌ క్లియర్‌!

Advertisement
 
Advertisement
Advertisement