మండే ఎండల్లో ముంచెత్తే వానలు?  | Western Disturbance is approaching northwest India | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో ముంచెత్తే వానలు? 

May 22 2026 4:41 AM | Updated on May 22 2026 4:41 AM

Western Disturbance is approaching northwest India

పాశ్చాత్య భంగం కారణంగా ముందే ముంచుకురానున్న వర్షాలు 

కశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్, హరియాణా, పంజాబ్, యూపీల్లో అకాల వర్షాల అవకాశం 

దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్న వేళ ఉత్తరభారత ప్రజలకు సూర్యప్రతాపం నుంచి భారీ ఉపశమనం కల్పించేందుకు అనూహ్యంగా ఉత్తరభారతంపై భారీ వర్షాలు కురిపించేందుకు పాశ్చాత్య భంగం(వెస్టర్న్‌ డిస్టబెన్సెస్‌) సంసిద్ధమవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాశ్చాత్య భంగం తాలూకు గాలుల తాజా ఉపగ్రహ చిత్రాలను వాతావరణ శాఖ విడుదలచేసింది. 

వడగాల్పులు, ఉక్కపోతతో ఉత్తరభారత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో చలికాలంలో మంచు, వర్షాలకు కారణమయ్యే పాశ్చాత్య భంగం తాలూకు గాలులు హఠాత్తుగా భారత్‌ దిశగా వస్తుండటంతో ఎండాకాల వేడిమి జనాలకు ఊరట లభించనుంది. మే 21వ తేదీన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల్లో పాశ్చాత్య భంగం సంబంధిత గాలులతో మేఘాలు, తుపానుకు ముందు కన్పించే వాతావరణం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, వాయవ్య భారత గగనతలాలపై అలుముకున్నట్లు కన్పించింది. 

తెల్లని దట్టమైన మేఘాలు హిమాలయ పర్వతాల వైపు, ఉత్తరభారత మైదానాల దిశగా పయనం మొదలెట్టినట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అరేబియా సముద్రం మీద సైతం తేమతో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. ఈశాన్య భారతం మీద, బంగాళాఖాతం మీద సైతం మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పాశ్చాత్య భంగం లేదా పశ్చిమ విక్షోభం అనేది భారత్‌ను చుట్టుముడితే మరింతగా తేమను మోసుకొచ్చి ఉత్తరభారతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన, ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

 ఉత్తర పాకిస్తాన్, జమ్మూకశ్మీర్‌లపై ఆకాశం అతిగా మేఘావృతం కావడంతో ఇక్కడి వాతావరణం హఠాత్తుగా మారుతూ అస్థిర పరిస్థితులను తీసుకురావచ్చు. ఈశాన్యభారతం మీదా మేఘాలు అతిగా కన్పిస్తుండటంతో వర్షాకాలం ప్రారంభంకాకమునుపే మెరుపులతో కూడిన వర్షాలు పడే ఆస్కారముందని నిపుణులు అభప్రాయపడ్డారు. పాశ్చాత్య భంగం ఇలాగే ఉధృతమై ముందుకు సాగితే ఉత్తరభారతంలో ముఖ్యంగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో వచ్చే కొద్దిరోజుల్లో వర్షాలు మొదలయ్యే వీలుంది.

 ధూళి తుపాన్లు, వడగండ్ల వానలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. పాశ్చాత్య భంగం మోసుకొచ్చి తేమ కారణంగా పడే వర్షాలు యావవత్‌ భారతదేశంలో ఎండ బాధలను పూర్తిగా తగ్గించకపోయినా ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గడానికి ఖచ్చితంగా దోహదపడతాయని నిపుణులు భరోసా ఇచ్చారు. 

అరేబియా సముద్రం, బంగాళాఖాతం దక్షిణప్రాంతాల్లో పెరిగిన మేఘాల సంచారం నెమ్మదిగా వర్షాకాల వాతావరణాన్ని సృష్టిస్తోంది. పాశ్చాత్య భంగం వేగంగా భారత్‌ను చుట్టుముడితే కనీసం ఉత్తర భారత ప్రజలకైనా ఈ ఉక్కపోత రాత్రుల నుంచి ఉపశమనం కల్గుతుంది. వడదెబ్బల భయం తగ్గుతుంది. అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న కాలుష్యం, శిలాజ ఇంధనాల అతి వినియోగం, క్లోరోఫ్లోరో కార్భన్‌లు భారీ స్థాయిలో వెలువడటం వంటివి భారత్‌లో వడగాల్పులు వచ్చే అవకాశాలు ప్రతిఏటా మరింత పెంచేస్తాయని నిపుణులు హెచ్చరించారు. 

ఏమిటీ పాశ్చాత్య భంగం? 
మధ్యధరా సముద్ర ప్రాంతం, కాస్పియన్‌ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల నుంచి మొదలై తూర్పు దిశగా పయనిస్తూ భారత్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో వర్షాలను కురిపించే అల్పపీడన వాయు ప్రసరణ వ్యవస్థను పాశ్చాత్యభంగం లేదా పశ్చిమ విక్షోభం అని పిలుస్తారు. పశ్చిమ విక్షోభ గాలులు తేమను మోసుకొస్తూ ఉత్తరభారతంలో మరీ ముఖ్యంగా హిమాలయాల్లో శీతాకాలంలో భారీగా మంచుకురవడానికి కారణమవుతాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోనూ వర్షాలకు ఈ పాశ్చాత్య భంగమే కారణం. భారత్‌లో గోధుమపంట దిగుబడినీ పశ్చిమ విక్షోభం నిర్ణయిస్తుంది. సరైన సమయంలో చుట్టుముట్టే పశ్చిమ విక్షోభంతో పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్‌లో గోధుమ దిగుబడి పెరుగుతుంది. శీతాకాలంలో మేఘాలు, వర్షం, హిమపాతం తెచ్చే పాశ్చాత్యభంగం ఒకరకంగా ఉత్తరభారతానికి మరో వర్షాకాలం వంటిది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement