ఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసింది
రిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్‌కు, క్రిమిలేయర్‌కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ క్రిమిలేయర్, రిజర్వేషన్లపై నమోదైన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై వ్యాఖ్యానించింది.
ఓబీసీ క్రిమిలేయర్‌కు సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలపై పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయన్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘ఇద్దరూ ఐఏఎస్ అధికారులు.ప్రభుత్వ సేవలో ఉన్నారు. బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ అవసరమా?’అని ప్రశ్నించింది. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ..‘విద్యా, ఆర్థిక శక్తివంతతతో సామాజిక స్థితి మార్పు వస్తుంది. కానీ మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే, ఈ వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటకు రాలేము’అని అన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో సామాజిక వెనుకబాటు ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటు మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఈ కేసులో వాదించిన అడ్వకేట్ శశాంక్ రత్నూ మాట్లాడుతూ..‘క్రిమీ లేయర్‌లో వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా, వారి స్థాయి ఆధారంగా తప్పించారు. కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించాలి’అని వాదించారు. ఆయన,ఈడబ్ల్యూఎస్, క్రిమీ లేయర్‌ను ఒకే విధంగా చూడకూడదని, క్రిమీ లేయర్ ప్రమాణాలు మరింత సడలింపుగా ఉండాలని సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, సుప్రీం కోర్టు పిటిషనర్లు, ప్రతివాదులు వంటి సంబంధిత పక్షాల నుంచి సమాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది.


