సరదా తీర్చిన ట్వీట్‌.. తారల మెడకు ఉచ్చు? | Old 2021 Bengal Tweet Sparks Fresh Trouble For TMC Linked Actors Amid Political Row, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

సరదా తీర్చిన ట్వీట్‌.. తారల మెడకు ఉచ్చు?

May 22 2026 11:12 AM | Updated on May 22 2026 1:37 PM

Old Bengal Tweet Comes Back to Trouble TMC Linked Actors

ఒకప్పుడు సరదాగా చేసిన పని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పెద్ద రాజకీయ బాంబులా పేలింది. ఐదేళ్ల కిందటి ఎన్నికల హింస తెర మీదకు రావడంతో ఇద్దరు సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. వాళ్ల మీద ఫిర్యాదు నమోదు కావడం, పైగా టీఎంసీతో దగ్గరి సంబంధాలు ఉండడంతో సువేందు అధికారి సర్కార్‌ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోందనే చర్చ ఊపందుకుంది.

2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చెలరేగిన హింస మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆనాడు కౌంటింగ్‌ జరుగుతున్న టైంలో నటుడు పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. ఫలితాల ట్రెండ్‌ ఆధారంగా ఆయన చేసిన ట్వీట్‌ ‘ఈరోజు ప్రత్యర్థులను చితక్కొట్టే రోజు’ అనే అర్థం వచ్చేలా ఉంది. దానికి నటి స్వస్తికా ముఖర్జీ ‘హహహ’ అంటూ లాఫింగ్‌ రియాక్షన్‌తో స్పందించారు.

అయితే.. ఆ తర్వాత కొన్నిగంటలకే బెంగాల్‌ అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం 11 మంది చనిపోయినట్లు అప్పటి దీదీ సర్కార్‌ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికల్లో ఉంది. అయితే తర్వాత వెలువడిన వివిధ నివేదికలు, దర్యాప్తుల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. “కాల్‌ ఫర్‌ జస్టిస్‌” అనే పౌర సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, 25 మంది మరణించారని, సుమారు 7 వేల మంది మహిళలు వేధింపులకు గురయ్యారని పేర్కొంది.

హత్యలు, దాడులు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులపై తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఒక్క దశలోనే 31 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. పాత కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వందల సంఖ్యలో కొత్త దర్యాప్తులు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్ల కిందట బెంగాల్‌ హింసపై దర్యాప్తు చేపట్టాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అంశం మళ్లీ చర్చకు రావడంతో.. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటుల పేర్లు కూడా వివాదంలో వినిపిస్తున్నాయి.

బెంగాలీ తారలు చేసిన ట్వీట్‌ హింసను ప్రేరేపించేలా ఉందని ఆరోపిస్తూ కోల్‌కతాలోని గరియాహట్‌ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన జోయ్‌దీప్‌ సేన్‌ అనే వ్యక్తి ఆరోపణ ఏమిటంటే.. 2021 మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. దానికి స్వస్తికా ముఖర్జీ నవ్వు గుర్తులతో స్పందించారు. అప్పటికే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖులైన వీరి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలకు ఇలాంటి పోస్టులు మానసిక ప్రోత్సాహం ఇచ్చాయి. అంతేకాదు.. ఆ ట్వీట్‌ చేసిన గంటలోపే బీజేపీ కార్యకర్త అభిజిత్‌ సర్కార్‌ హత్య జరిగిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆ ఎన్నికల హింసను విచారణ జరిపేందుకు సువేందు సర్కార్‌ ఓ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా వీళ్ల అంశాన్ని పరిశీలించే అవకాశమూ కనిపిస్తోంది. 

పరంబ్రతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ.. ప్రముఖ బెంగాలీ యాక్టర్లు. పరంబత్రాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం.  ప్రముఖ దర్శకుడు రుత్విక్‌ ఘటక్‌కు బంధువు. రచయిత్రి మహాశ్వేతా దేవి కుటుంబానికి చెందినవారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటు హిందీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ  నటించారు. అందులో కహానీ, బైషే శ్రాబోన్, పారి, బుల్బుల్, అరణ్యక్‌లో నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక.. స్వస్తిక ముఖర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు సంతూ ముఖర్జీ కుమార్తె. బుల్లితెరతో కెరీర్‌ ప్రారంభించి బెంగాలీ స్టార్‌గా ఎదిగారు. బెంగాలీతో పాటు హిందీలోనూ నటించారు. పాతాళ్ లోక్, దిల్ బేచారా, ఖాలా, మస్తాన్, శ్రీమతి వాటిల్లో ప్రముఖమైనవి.

పరంబత్రా, స్వస్తికా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు చెప్పడం వల్ల తరచూ వార్తల్లో ఉంటుంటారు. బెంగాల్‌లో లౌకికవాదం, స్వేచ్ఛ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. అందుకే ఈ ఇద్దరికీ మమతా బెనర్జీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెబుతుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement