న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) వర్గాలు గురువారం తెలిపాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల అంతరాయాలపై ఆందోళనలు నెలకొన్న వేళ ఇంధన కొరత ఉందని చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓఎంసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రష్యా నుంచి వస్తున్న ముడి చమురు సరఫరాలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపింది.
ఓఎంసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల్లో ‘మిగులు’ స్థితిలోనే ఉంది. సీజనల్ డిమాండ్, మార్కెట్ ధరల మార్పుల వల్ల కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలో ఇంధన అమ్మకాలు పెరుగుతున్నాయి. “భారత్ నెట్ ఎగుమతిదారు కావడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్లో మిగులు స్థితిలో ఉంది. పెట్రోల్/డీజిల్/ఎల్‌పీజీ కొరత లేదు” అని ఓఎంసీ వర్గాలు తెలిపాయి. నెట్ ఎగుమతిదారు అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా చేసే దేశం లేదా సంస్థ.
ముడి చమురు దిగుమతులపై ఓఎంసీ వర్గాలు మాట్లాడుతూ.. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా నుంచి సరఫరాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపాయి. కొన్ని ఇంధన బంకుల్లో అమ్మకాలు పెరగడానికి పంట కోత సీజన్‌లో డీజిల్ డిమాండ్ పెరగడం సహా పలు కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.5 అధిక ధర తీసుకుంటుండడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ ఇంధన విక్రేతల వద్ద కొంటున్నారని కూడా వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు ఎక్కువగా ఉండటంతో సంస్థాగత, వాణిజ్య కొనుగోలుదారులు కూడా ప్రభుత్వ రంగ ఇంధన బంకుల వైపు మారుతున్నారని వర్గాలు తెలిపాయి.
అవసరాల మేరకే వాహనాల్లో నింపుకోవాలి..
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్‌లెట్లలో పెరుగుతున్న డిమాండ్ మధ్య సరిపడా ఇంధన లభ్యత ఉండేలా తమ సరఫరా కేంద్రాలు, ఫీల్డ్ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తెలిపింది.
“దేశవ్యాప్తంగా మా రిటైల్ ఔట్‌లెట్లలో సరిపడా ఉత్పత్తుల లభ్యత ఉండేలా మా సరఫరా కేంద్రాలు, టీమ్స్ సమన్వయంతో నిరంతరం పని చేస్తున్నాయి. వినియోగదారులు తమ సాధారణ అవసరాల మేరకే వాహనాల్లో ఇంధనం నింపుకోవాలి” అని ఐఓసీఎల్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది. భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయొద్దని కోరింది. మారుతున్న డిమాండ్ ధోరణుల వల్ల రవాణా వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, నిరంతర ఇంధన సరఫరా కొనసాగించే బాధ్యత తమదేనని కంపెనీ తెలిపింది.
“పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సజావుగా కొనసాగించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే వాణిజ్య అమ్మకాలు, ప్రైవేట్ పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ఔట్‌లెట్ల వైపు డిమాండ్ మారడంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దాన్ని పరిష్కరించేందుకు మా టీమ్ ప్రయత్నిస్తోంది” అని కంపెనీ తెలిపింది.


