
దాయాది దాడులను తుత్తునియలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ
పాక్ క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే పేల్చేసిన అధునాతన ఆయుధ వ్యవస్థ
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కరమూకల శిబిరాలు, స్థావరాలను భారత సాయుధబలగాలు నేలమట్టం చేయడంతో వెర్రెక్కిపోయి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది.
రక్షణ చట్రంగా యావత్ భారతగగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిస్సైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది.
విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమస్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గమధ్యంలోనే ముక్కలుచెక్కలు చేసేస్తున్న ఈ సుదర్శన చక్ర విశేషాలు ఓసారి చూద్దాం...
ఏమిటీ చక్ర?
రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌కు భారత బలగాలు ‘సుదర్శన చక్ర’ అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం. ఒకసారి ప్రయోగిస్తే శత్రుసంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశకానికి మారుపేరు. అందుకే ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రుసైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను ‘సుదర్శన చక్ర’లోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి. మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై రక్షణచట్రంగా నిఘా పెట్టడం ‘సుదర్శన చక్ర’ ప్రత్యేకత.
వాయుసేనతో అనుసంధానం
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌తో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో రెండు ఆయుధసహిత వాహనాలు(బ్యాటరీలు) ఉంటాయి. ఒక్కో దాంట్లో ఆరు లాంఛర్లు ఉంటాయి. వీటితోపాటు అధునాతన రాడార్ వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇలాంటి పెద్ద వ్యవస్థలను ఐదింటిని ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సంస్ధించేసింది. ఈ వ్యవస్థలే బుధవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. సుదర్శన చక్ర లాంఛర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు. వీటి జాడను శత్రు దేశాల రాడార్‌లు అస్సలు కనిపెట్టలేవు.
అన్ని రకాలుగా రక్షణ
శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి? ఎంత వేగంతో వస్తున్నాయి? ఒకేసారి ఎన్ని వస్తున్నాయి? ఏఏ ప్రాంతాలపై పడొచ్చు? అనే వివరాలను కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనావేయగలవు. వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంఛర్‌ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే తుత్తునియలు చేస్తాయి. ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులను మాత్రమే కాదు వేర్వేరు దిశల నుంచి దూసుకొచ్చే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ ఒకేసారి పసిగట్టి ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దిశల్లో ప్రయోగించగలదు.
ఎక్కడ మోహరించారు?
పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది. నాలుగు ‘సుదర్శన చక్ర’ వ్యవస్థలను భారత్ మోహరించింది. వందల కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం ఒక్క స్వాడ్రాన్ నిఘా పెట్టగలదు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల గగనతల నిఘాపై ఒకటి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై మరోటి మోహరించినట్లు తెలుస్తోంది. చైనా సైతం తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు.
వెంటనే ప్రయాణం మొదలెట్టి గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చగలదు. ఒకేసారి భిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యంత వేగంగా, చాకచక్యంగా పని పూర్తిచేయగలదు. తికమకపెట్టే శత్రుదేశాల ‘ఏమార్చే’ వ్యవస్థలు ఈ సుదర్శన చక్రను మభ్యపెట్టలేవు. గగనతలంపై 360 డిగ్రీల కోణంలో ఇది నిఘా పెట్టగలదు. తన కనుసన్నల్లోకి ఏ చిన్నపాటి వస్తువు ఆకాశంలోకి ప్రవేశించినా దాని పరిమాణం, పథాన్ని పసిగట్టి వెంటనే క్షిపణిని ప్రయోగించి ధ్వంసంచేయగలదు. ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదీ ఒకటి.
సుదూరాలు సురక్షితం
జామింగ్ వంటి వ్యతిరేక వ్యూహాలను తట్టుకోగలదు. ఒకేసారి బహళ లక్ష్యాలను ఎంచుకుని పనిచేస్తుంది. అత్యంత సుదూరాలు, సువిశాల ప్రాంతాలకు రక్షణగా నిలుస్తుంది. గగనతల లక్ష్యాలను కేవలం భూతలం మీద నుంచే గురిపెట్టి చేధించగలదు. ముఖ్యంగా దీర్ఘశ్రేణి అస్ట్రాలను నిర్వీర్యంచేయగలదు. రష్యా నుంచి కొనుగోలు తర్వాత వీటి రాకతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్