వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం బీచ్, అదీ గోవాలో | Goa Reimagines Remote Work, Work From Beach Initiative Blends Tourism And Office Life At Shackathon 2026 | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం బీచ్, అదీ గోవాలో

May 22 2026 1:05 PM | Updated on May 22 2026 4:53 PM

Goa Chief Minister Pramod Sawant Wants You To Work From Beach

మధ్యప్రాచ్య  ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్, సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 11న పౌరులను ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, ఒక  ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలంటూ కొన్ని పొదుపు సూత్రాలను ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పెట్రోల్‌ ఖర్చును ఆదా చేసేందుకు ఇంటి నుండి పని చేయడం (వర్క్ ఫ్రమ్ హోమ్)  ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కొత్త కాన్సెప్ట్‌ను  తెరపైకి తెచ్చారు.. అదే వర్క్ ఫ్రమ్ బీచ్ (బీచ్ నుండి పని చేయడం) ఇంటి నుండి పని చేయడం  అంటే ఉద్యోగులకు పండగే..అదీ  గోవా బీచ్‌ల నుండి పని చేసే అవకాశం లభిస్తే, ఆ మజాయే వేరు  కదా.  ప్రధాని తాజా పిలుపు నేపథ్యంలో  గతంలో కోవిడ్ సమయంలో తీసుకున్నటువంటి చర్యలను మళ్లీ పాటించాలని, అందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంచుకోవాలని గోవా  సీఎం ప్రతిపాదించారు.  గోవా షాకథాన్ (Shackathon) 2026 సందర్భంగా  సీఎం ప్రమోద్ సావంత్  విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకోవాలన్నారు.  దీనిని స్ఫూర్తిగా తీసుకుని,దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులు గోవాను తమ కొత్త 'వర్క్-ఫ్రమ్-వెకేషన్' స్థానంగా మార్చుకోవాలని పిలుపునిస్తున్నారు.'వర్క్‌ ఫ్రమ్‌ హోం' మాదిరి గోవా బీచ్‌ల నుంచే సందర్శకులు తమ ఆఫీసు పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రమోద్‌ సావంత్ తెలిపారు. అంతేకాదు గోవా స్టార్టప్‌లకు కూడా అనువైనదని పేర్కొన్నారు.


గోవాను వర్క్-వెకేషన్ గమ్యస్థానంగా మార్చేందుకే  పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఎ. ఖాంటే మరియు సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి రోహన్ ఖాంటే కలిసి ఈ 'షాకథాన్ 2026'ను ప్రారంభించారని ముఖ్యమంత్రి తెలిపారు. భారతదేశంలో బీచ్ నుండి పని చేయడం అనేది  ఒక సరికొత్త కాన్సెప్ట్ అన్నారు. ప్రధాని మోదీ పౌరులను ఇంటి నుండి పని చేయాలని కోరారని, అయితే ప్రజలు తరచూ ఒకే చోట ఉండి బోర్ ఫీలవుతుంటారని ఆయన పేర్కొన్నారు.

మౌలిక వసతులు
బీచ్ నుండి పని ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను (Infrastructure) ఏర్పాటు చేస్తున్నామన్నామని సీఎం సావంత్ తెలిపారు. గోవా అంటే కేవలం సూర్యుడు, ఇసుక తిన్నెలు, సముద్రం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో గోవా బీచ్‌లలోని షాక్స్ (తాత్కాలిక కుటీరాలు) అంటే కేవలం సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను చూస్తూ చికెన్, ఫిష్ తింటూ బీర్ తాగి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రసిద్ధి చెందాయి. కానీ ఇప్పుడు పర్యాటకులు కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఉంటూ బీచ్‌ల నుండి  పనిచేసుకోవచ్చని చెప్పారు. 

గోవా షాకథాన్ 
గోవా షాకథాన్ అనేది మే 21-22 తేదీలలో బీచ్‌సైడ్ 'వర్కేషన్' (Workation) అనుభవం కోసం క్రియేటర్లు, విద్యార్థులు, స్టార్టప్‌లు, రిమోట్ ఉద్యోగులు, ఆవిష్కర్తలు మరియు డిజైనర్లను ఒకే చోటికి చేర్చే ఒక రెండు రోజుల ఈవెంట్. దీనిని గోవా ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ (DITE&C) నిర్వహిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement