ఉమర్ ఖాలిద్‌కు తాత్కాలిక ఊరట | Delhi riots accused Umar Khalid Gets Temporary Relief | Sakshi
Sakshi News home page

ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్‌

May 22 2026 12:51 PM | Updated on May 22 2026 7:16 PM

Delhi riots accused Umar Khalid Gets Temporary Relief

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్‌యూ విద్యార్థి నేత కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన తీహార్‌ జైలు నుంచి బయటకు రానున్నారు.

శుక్రవారం హైకోర్టు ఖాలిద్‌కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. అయితే ఈ తాత్కాలిక బెయిల్‌ ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా మంజూరైంది. రూ.1 లక్షల ష్యూరిటీ చెల్లించాలని.. అలాగే ఈ మూడు రోజుల సమయంలో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.  అంటే.. ఆయన ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు అన్న విషయాలు నియంత్రణలో ఉండేలా ఆంక్షలు విధించిందన్నమాట.

ఉమర్ ఖాలిద్ 2020లో ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన నిర్దోషి అని వాదిస్తూ పలు సార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు ఆయనకు దీర్ఘకాలిక బెయిల్‌ లభించలేదు. అయితే ఇటీవలె బెయిల్‌ నిరాకరణపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కుటుంబ కారణాల వల్ల హైకోర్టు మూడు రోజుల తాత్కాలిక బెయిల్‌ ఇవ్వడం గమనార్హం.

ఢిల్లీ అల్లర్లు.. 
పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో దాదాపు 53 మంది మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఛార్జిషీట్‌ నమోదు చేశారు. 

వీళ్లలో ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌ సహా ఏడుగురు నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ వీరు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్‌ అరవింద్ కుమార్, జస్టిస్‌ అంజారియా ధర్మాసనం ఐదుగురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఖాలిద్‌, ఇమామ్‌కు మాత్రం బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.

సుప్రీం ధర్మాసనం అసంతృప్తి
ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ.. ఈ ఏడాది జనవరిలో జస్టిస్‌ అరవింద్ కుమార్, జస్టిస్‌ అంజారియా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఇటీవల ఈ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపా కేసులో ఆరేళ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్‌ మంజూరు చేయవచ్చని, 2021లో ఓ కేసులో ముగ్గురు న్యాయమార్తులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ జడ్జిమెంట్‌ను జనవరిలో తీర్పు ఇచ్చిన సమయంలో ధర్మాసనం సరిగా అనుసరించలేదని వ్యాఖ్యానించింది. గతంలో ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరించడం కష్టమని చెబుతూ.. ఉపా కేసులలో సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, విచారణలో జాప్యం వంటి కారణాలతో బెయిల్‌ మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఖాలిద్‌కు తాత్కాలిక బెయిల్‌ దక్కడం గమనార్హం.

ఫేక్‌ ఎవిడెన్స్‌పై విమర్శలు..
2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి.  97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించాయి. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్‌ ఎవిడెన్స్‌ను కోర్టులు హైలైట్‌ చేశాయి. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement