అమ్మకానికి 'ఐమాక్స్'? | Imax For Sale And What Really Happened | Sakshi
Sakshi News home page

Imax Sale: ప్రపంచ సినీ రంగంలో భారీ మార్పు?

May 22 2026 5:16 PM | Updated on May 22 2026 6:13 PM

Imax For Sale And What Really Happened

అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే ప్రపంచంలో చాలామందికి గుర్తొచ్చేది 'ఐమాక్స్'. భారత్‌లో ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్లు పెద్దగా లేవు. గుజరాజ్‌లో ఒకటి మాత్రమే ఉంది! దాదాపు 60 ఏళ్ల క్రితం స్థాపించిన ఐమాక్స్ సంస్థ.. ఇప్పుడు అమ్మకానికి సిద్ధమైందనే వార్త సంచలనంగా మారింది. ఇది ప్రపంచ ఎగ్జిబిషన్ రంగంలో భారీ మార్పులకు నాంది పలకనుందని మాట్లాడుకుంటున్నారు. ఈ విక్రయానికి సంబంధించిన విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ప్రముఖ సినిమా టెక్నాలజీ సంస్థ ఐమాక్స్.. అమ్మే అవకాశాలు పరిశీలిస్తోందని.. ఇప్పటికే ప్రారంభ దశ చర్చలు కూడా మొదలైపోయినట్లు టాక్. ఈ క్రమంలోనే పలు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఐమాక్స్ మార్కెట్ విలువ సుమారు 1.85 బిలియన్ డాలర్లుగా ఉంది.

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. కానీ వాటి నుంచి నెమ్మదిగా బయటపడ్డాయి. ఇప్పటికీ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ థియేటర్లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఐమాక్స్ లాంటి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లలో సినిమా చూసేందుకు ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనేందుకు ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. అలాంటిది ఐమాక్స్ ఎందుకు అమ్మకానికి సిద్ధమైందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐమాక్స్‌కి సంబంధించిన ఈ వార్త బయటకు రాగానే ఈ సంస్థ షేర్లు దాదాపు 17 శాతం వరకు పెరగడం విశేషం.

1967లో కెనడాలో ఐమాక్స్ సంస్థని స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు సొంత టెక్నాలజీ ఫ్లాట్‌ఫార్మ్‌గా కొనసాగుతోంది. ప్రత్యేక కెమెరాలు, అధునాతన ఆడియో వ్యవస్థలు, ప్రత్యేక థియేటర్ డిజైన్‌లతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్రయ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, నిజంగానే అమ్మేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందని నిపుణులు మాట్లాడుకుంటున్నారు. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తీస్తున్న 'వారణాసి' సినిమాని ఐమాక్స్ ఫార్మాట్‌లోనే తీస్తున్నారు. ఇదే ఫార్మాట్‌లో తీసిన క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' విడుదలకు సిద్ధమైంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

Advertisement
 
Advertisement
Advertisement