
పోప్ లియో–14 పేరుతో క్యాథలిక్ గురువుగా పట్టం
అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డు..
అందరం కలిసుండటానికి వారధులు నిర్మిద్దాం: పోప్
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది క్యాథలిక్‌ల కొత్త మత గురువుగా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. 69 ఏళ్ల ప్రివోస్ట్ పోప్ లియో 14 పేరుతో 267వ పోప్‌గా అధికారం చేపట్టనున్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైన 133 మంది కార్డినల్స్ కొత్త పోప్‌ను గురువారం ఎన్నుకున్నారు. కొత్త పోప్‌ను ఎన్నుకున్నందుకు సూచనగా సెయింట్ పీటర్స్ బసిలికాలోని సిస్టైన్ చాపెల్ నుంచి తెల్లని పొగను వదిలారు.
ఆ తర్వాత 70 నిమిషాలకు చర్చిలోని సెంట్రల్ బాల్కనీ నుంచి ఫ్రెంచ్ కార్డినల్ డొమినిక్ మంబెర్టీ లాటిన్ భాషలో ‘హబెమస్ పాపమ్’(మనకు కొత్త పోప్ వచ్చారు) అని ప్రకటించారు. ఆ వెంటనే వాటికన్‌లో సంబరాలు మొదలయ్యాయి. చర్చి ముందు గుమికూడిన వేలమంది కైస్తవులు ‘వివా ఇల్ పాపా’అని నినదించారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల అనారోగ్యంతో మరణించటంతో కొత్త పోప్‌ను ఎన్నుకున్నారు.
అమెరికా నుంచి తొలి పోప్
అగ్రరాజ్యం అమెరికా నుంచి పోప్‌గా ఎన్నిౖకైనతొలి వ్యక్తిగా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ చరిత్ర సృష్టించారు. షికాగో నగరంలో 1955 సెపె్టంబర్ 14న జన్మించిన ప్రివోస్ట్.. 2023లోనే కార్డినల్‌గా నియమితులయ్యారు.ఆయన ఎక్కు వ కాలం పెరూలో సేవలందించారు. ఆయన మీడియాకు దూరంగా ఉంటారు. అత్యంత అరుదుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. పోప్‌గా ఎన్నికైన తొలి అగస్టీని యన్ కూడా ఈయనే.
చికాగోలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన.. పెన్సిల్వేనియాలోని విల్లనోవా యూనివర్సిటీ నుంచి గణితంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు. క్యాథలిక్ థీయాలజీ యూనియన్ ఆఫ్ చికా గోలో థీయాలజీలో డిప్లొమా చేశారు. రోమ్‌లోని సెయింట్ థామ స్ అక్వినాస్ యూనివర్సిటీలో క్యానన్ లా చదివారు. 19 82లో ప్రీస్ట్‌గా నియమితులయ్యారు. పెరూలోని త్రుజిల్లో సెమిటరీలో క్యానన్ లాను చాలాకాలంపాటు బోధించారు.
వారధులు నిర్మిద్దాం
పోప్‌గా ఎన్నికైన తర్వాత సెయింట్ పీటర్స్ బసిలికా నుంచి తొలి సందేశమిచ్చిన పోప్ లియో 14.. ప్రపంచంలోని మనుషులందరినీ కలిపే వారధులు నిర్మిద్దామని పిలుపునిచ్చారు. చర్చలకు వేదికగా చర్చిని తీర్చి దిద్దుతానని ప్రకటించారు. కాగా, అమెరికా వ్యక్తిని తొలిసారి పోప్‌గా ఎన్నుకోవటం అమెరికన్లందరికీ గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.