ఉద్యోగం పోయినా సంబరమే..! | From Layoff To Liberation, Ex-Meta Employee Says Losing Job Brought Her Life Back, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోయినా సంబరమే..!

May 22 2026 12:22 PM | Updated on May 22 2026 12:48 PM

Losing a job gave me back my life Meta Layoff Girl Viral Post

ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్‌ అనే యువతి ఇటీవల లేఆఫ్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.

పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్‌ వర్క్‌తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే..

ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.

ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి.  “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement