మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.
అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..
బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.
ఆదాయంలో భారీ వృద్ధి
మే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.
రిస్క్ బఫర్ పెంపు
ప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్‌ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.
ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్‌గా) ఉపయోగపడనుంది.
ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి.


