విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అంతకంతకూ ఎండ తీవ్రత పెరిగిపోయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయో ఎండ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
ఈరోజు(గురువారం, మే 21వ తేదీ) రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదు కాగా, కృష్ణా జిల్లా కంకిపాడులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏలూరు జిల్లా చింతలపూడిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
బయటకు వెళ్లాలంటే భయం..
భానుడి భగభగలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎండలకు హడలిపోతున్నారు. గత వారం నుంచి ఉదయం మొదలు కొని సాయంత్రం వరకూ తీవ్రమైన ఉక్కపోతతో పాటు సెగలు కక్కే ఎండే కనిపిస్తూ ఉండటంతో సాధారణమైన పనులు చేసుకోవడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఎండలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఉన్న వారు ఏసీ చాటను, ఫ్యాన్లు ఉన్నవారు ఫ్యాన్ల మాటునే సేద తీరుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటితే గానీ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ఈ ఎండల నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతామా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు.


