
ముందుగానే పలకరించనున్న రుతుపవనాలు
మే 13న దక్షిణ అండమాన్‌లోకి నైరుతి
రాష్ట్రానికి మరో 2 రోజులు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: దేశమంతా భానుడి భగభగలతో మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ (ఐఎండీ)చల్లని కబురు అందించింది. ముందుగానే ఊహించినట్టు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. మే 13న రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. 13 సాయంత్రం నాటికి అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి ప్రవేశించనుంది. సాధారణంగా రుతుపవనాలు మే 20 తర్వాతే అక్కడికి చేరుకుంటాయి.
కానీ.. ఈసారి వాతావరణ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో వారం ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి రాబోతున్నాయి. రుతుపవనాల రాకకు వాతావరణం కలిసొస్తే జూన్ మొదటి వారంలోనే కేరళని తాకే అవకాశం ఉంది. ఈసారి నైరుతి కాలంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి.
దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని.. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు తెలిపారు.