
ప్రవేశాలు ప్రారంభించిన ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు
ఈ ఏడాది అన్ని తరగతులకు 40 శాతం పైనే పెంపు
రవాణా, యూనిఫాం, ఇతర ఖర్చులు అదనం
మదనపల్లె సిటీ: వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలలు ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాయి. ఇది వరకకే తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి 40 శాతానికిపైగా ఫీజులు పెంచుతూ వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సమాచారం పంపుతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భయంతో బెంబేలెత్తుతున్నారు. పోటీ ప్రపంచంలో బడి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజులు పెంచినా తప్పనిసరిగా చెల్లించే పరిస్థితి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో మదనపల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ కింద ఎల్‌కేజీలోనే ప్రవేశాలకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాఠశాలలో వసతులు, సౌకర్యాలను బట్టి ఇవి మరింత ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాలకు రవాణా సౌకర్యం,యూనిఫాం, పాఠశాలల్లో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, పరీక్షల రుసుం తదితర వాటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెరసి ఒకటో తరగతి చదివే విద్యార్థికి ఏడాదికి సగటున రూ.80వేలు వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌కు చెందిన కిషోర్‌కు ఒక కూతురు. మూడో తరగతి పూర్తి చేసిన ఆ పాపను ఓ కార్పొరేట్ బడిలో చేర్పిద్దామని ఇటీవల అక్కడికి వెళ్లగా నాలుగో తరగతి ఫీజు రూ.62 వేలుగా తేల్చేశారు. మూడో తరగతికి కిషోర్ కట్టిన ఫీజు రూ.36 వేలు, ఏకంగా రెట్టింపు అడగడంతో కంగుతిన్న కిషోర్ కొత్త బడిలో చేర్పిద్దామనే ఆలోచనకు స్వస్తి పలికి పాత పాఠశాలలోనే కొనసాగించాలనే నిర్ణయానికొచ్చారు.
వాల్మీకిపురం కోనేటికట్టకు చెందిన శ్రీనివాస్ తన మూడేళ్లు కొడుకును ప్లే స్కూల్‌లో చేర్చిద్దామని వెళ్లగా ఏడాదికి ఫీజు రూ.30 వేలు అని చెప్పింది స్కూల్ యాజమాన్యం. వచ్చే విద్యా సంవత్సరం(2025–26)కి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, ఆలస్యమైతే మరో రూ.5 వేలు ఎక్కువవుతాయని చెప్పగా తొలి దశ కింద రూ.10వేలు కట్టి అడ్మిషన్ ఖాయం చేసుకున్నారు.
కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన శశివర్థన్,శ్వేత దంపతులకు ఇద్దలు పిల్లలు. సీబీఎస్‌ఈ సిలబస్ ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీలో తన కుమారుడిని చేర్పించడానికి ఫీజుల వివరాలు ఆరా తీశారు. ఏడాదికి రూ.56 వేలు ఫీజు, రవాణా, యూనిఫాం, ఇతర ఖర్చులు అదనమని చెప్పడంతో తక్కువ ఫీజు ఉన్న ఇతర పాఠశాలలో చేర్పించాలని నిర్ణయానికి వచ్చారు.
కనిపించని ఫీజు బోర్డులు
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు బోర్డులు ఎక్కడా కన్పించడం లేదు. ఏ తరగతికి ఎంత ఫీజు వివరాలు ఆయా పాఠశాలల్లో బోర్డుల్లో కనబరచాలి. అలాంటిది ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
చర్యలు తీసుకోవాలి
అధికంగాఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. వేసవి సెలవుల్లోనే కొన్ని కార్పోరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీజులతో పాటు అదనంగా పుస్తకాలు వంటి వాటి పేరుతో అధికంగా డబ్బులు గుంజుతున్నారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. –మాధవ్, ఏఐఎస్‌ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి