
ఏపీఎండీసీ ద్వారా అప్పుల కోసం బాండ్ల జారీకి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు
కూటమి సర్కారు రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్సార్‌సీపీ పిల్
దీనిపై కౌంటర్లు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
ఆగస్టు 6న తదుపరి విచారణ
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ద్వారా రూ.9 వేల కోట్లను అప్పులుగా బాండ్ల రూపంలో సేకరించేందుకు వీలుగా జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమే
ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్లు కొనుగోలుదారులు సంచిత నిధి నుంచి తీసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని 436 మైనర్ మినరల్ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీ ఎండీసీకి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న జీవో 69 జారీ చేసిందన్నారు.
ఏపీ ఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లను బాండ్ల రూపంలో అప్పుగా తీసుకురావాలన్న ఉద్దేశంతో బాండ్లు జారీ చేస్తోందన్నారు. గనులను తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చేందుకు, అమ్ముకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తోందన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని వీరారెడ్డి తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ అప్పుల వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది.
ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొంది. దీనికి వీరారెడ్డి స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రకారం అప్పుల విషయంలో ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. ప్రైవేటు వ్యక్తులు నేరుగా సంచిత నిధి నుంచి డబ్బు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.