గుడివాడ: గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోహన్‌రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు,.. ఆ బంగారు కిరీటాన్ని రూ. 30 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్‌ఐర్‌లో నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదుతో చివరకు చర్యలకు సన్నద్ధమయ్యారు పోలీసులు.
కాగా, గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు గుడివాడ వెంకటేశ్వర స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.
మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్ లాకర్‌లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు. దాంతో సుబ్బారావు కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించిన పోలీసులు.. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.


