దక్షిణ అండమాన్‌కు ఆనుకొని ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఆవరించి ఉంది. బుధవారం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం రానున్న 48 గంటల్లో బలపడి రెండు రోజుల పాటు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రానున్న 3 రోజులు తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలో పొడిగాలులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది.