వారంలోగా ఉస్మానియా ఖాళీ | Sakshi
Sakshi News home page

వారంలోగా ఉస్మానియా ఖాళీ

Published Fri, Jul 24 2015 8:26 AM

వారసత్వ కట్టడాల పేరుతో రోగులు, వైద్యులు, నర్సులను చంపుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయిస్తా. ఇందు కోసం అవసరమైతే గవర్నర్, హైకోర్టు సీజే, ఎంసీఐతో స్వయం గా మాట్లాడుతా. ఆస్పత్రి పరిస్థితిని వివరిస్తా’అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ రమణిలతో కలసి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రధాన భవనంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌తోపాటు ఇన్‌పేషంట్ వార్డులు, పేయింగ్ బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌ను సందర్శించారు. పాత భవనం దుస్థితి, కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు.. ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని 110 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇది చాలా వరకు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. భవనం స్థితి గతులపై జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులతో ఇప్పటికే అధ్యయనం చేయించాం. ఇది రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని వారు స్పష్టం చేశారు. వర్షాలకు పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు, నర్సు ల తలలు పగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ రోగులను ఉంచడం క్షేమం కాదు. రోగులను వారం రోజుల్లో ఇతర ఆస్పత్రులకు తరలిస్తాం’ అని సీఎం అన్నారు. ‘వైద్య విద్యార్థులు, నర్సులు, వైద్యులకు ఇబ్బంది కలగకుండా మెడికల్ కాలేజీకి సమీపంలోనే ఏదైనా ప్రైవేటు భవ నం అద్దెకు తీసుకుని వీరందరిని అందులోకి షిఫ్ట్ చేస్తాం. మెడికల్ సీట్లకు ఇబ్బంది కలగకుండా ఎంసీఐ అనుమతి కూడా తీసుకుంటాం. అడ్డం కులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిస్థితిని వివరిస్తాం. ఆస్పత్రిని సందర్శించాల్సిందిగా వారిని కోరుతాం. వారసత్వ కట్టడాల జాబితా నుంచి భవనాన్ని తొలగింపజేసే ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాం.